Drop Down Menus

హనుమంతుని – తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవలసిన ఈ అద్భుతమైన కథ..| Hanuman stories in Telugu

హనుమంతుని – తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవలసిన ఈ అద్భుతమైన కథ..

రామభక్తుడు, భయనివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించివున్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామస్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణప్రాణదాయకుడైన సంజీవనగిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు.

అయితే, వీటన్నింటికంటే విశిష్టమైన రూపం – తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్నవారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం.

రండి….హనుమంతుని వాల ఘంట కథను తెలుసుకుందాం!

అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి. నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో, పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన – సీతమ్మ అపహరణ. 

ప్రాణప్రదురాలైన భార్యను వెదుకుతూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకూ వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు.

యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని, భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు…

యుద్ధమంటే విహార యాత్ర కాదు కదా! హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో? నేల కూలేదెవరో?

ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప!రాక్షసులతో రణానికి తరలివెళుతున్న తమవాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామికార్యం, మరొకవైపు పేగుబంధం – ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామికార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్ళు కారుతున్నా 'విజయోస్తు…దిగ్విజయోస్తు' అని అంటున్నారు కుటుంబ సభ్యులు.

ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు. కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డాడు. తుది వీడ్కోళ్ళు ముగిసాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు 

'ఓ వానరులారా! ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అఋణిని. ఎవరీ ఋణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి. కనుక, ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో, అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను.' అని అన్నాడు.

జనన-మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారియై వాగ్దానం చేసాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగివస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి…

రామ సేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు 'సింగిలీకలు' అని పిలువబడే పొట్టి పొట్టి…మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడియైన గోళ్ళు – ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం.

రామ-రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడ ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే. రావణుడు – కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే, తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన, ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టివున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా, వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు.రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది.

అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యిమంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి, నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం. కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది…ఆ వెయ్యి కోతులూ గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. 

ఏ చప్పుడూ వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది.

అలా కొద్దిసేపు గడిచాక, ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడ సాగింది. “మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు.

చచ్చిపోతామేమో?” అని ఒక కోతి అంది. 'మనం తప్పు చేసాం!” అని మరొక కోతి అంది. 'అవును, మన రాజు, మంత్రి – ఇద్దరూ మూర్ఖులే! వాళ్ళని నమ్మి మోసపోయాం” అని ఇంకొక కోతి అంది.

'అసలా రాముడు ఎవడు? అతనికి, మనకి సంబంధమేముంది? అయినా వచ్చాం కదా! కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు. నమ్మకద్రోహి” అని ఫలాన ఒక కోతి వదిరింది. “అవునవును…' అన్నాయి ఎన్నో కోతులు.

అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి –'అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సహనంతో ఉందాం. రామ నామ స్మరణ చేద్దాం.' అంది.

ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి. అవహేళన చేసాయి.

అయినా సరే, ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఇంకొంతసేపు గడిచాక, తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామ నామాన్ని చేయసాగాయి. అలా అలా కొద్ది కాలంలోనే, అన్ని కోతులు రామ నామ సంకీర్తనలో మునిగిపోయాయి.

ఈలోపు, గంట బైట ఏం జరిగిందో చూద్దాం! రాముడు రావణున్ని సంహరించాడు. సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసాడు. ఇక అయోధ్యకు బయల్దేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి, తన వాగ్దానాన్ని గుర్తు చేసాడు. కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 'ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నా' యని చెప్పాడు. మళ్ళీ లెక్కవేయమన్నాడు రాముడు. మళ్ళీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు.

ముందు హనుమ దారి చేస్తుండగా, యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నింటి మధ్యా ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు. అంతలో, స్వామి దృష్టి ఒక గంటపై పడింది.'హనుమా…' అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయింది. వెంటనే తోకను పెంచి…గంటను పైకి లేపాడు.అక్కడ….ఆ గంట క్రింద….పెదవులపై రామనామం తాండవిస్తుండగా, మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చునివున్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్కవేసాడు. వెయ్యి సింగిలీక కోతులు. లెక్కసరిపోయింది. చుట్టూవున్న వానర సైన్యం ఒకపెట్టున 'జయ జయ రామ….జయ జయ రఘురామా” అంటూ జయఘోషను చేసింది. 

అప్పటి వరకూ చీమ చిటుకుమన్న శబ్దం కూడ వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషలా వినబడిన జయజయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడినపోయిన కళ్ళతో ధగధగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక, కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని, నెమ్మదిగా చూడసాగాయి.అదిగో…ఎదురుగా….ఆజానుబాహుడు…అరవిందదళాయతాక్షుడు …నిశాచరవినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడివున్నాడు.

అంతే….సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానరసైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. 'జై శ్రీరామ…జై శ్రీరామా”అప్పుడు తెలిసింది ఏం చేయాలో…వెంటనే రామపాదారవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. 'రాముడు మోసగాడు' అన్న ఈ కోతిని, 'హనుమంతుడు బుద్ధిహీనుడు' అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం 'తారక మంత్రమే త్రోవ' అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది.

'సుందరే సుందరం కపిః' – ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూసాడు ముగ్ధమోహనుడైన రాముడు. 'హనుమా! రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో – వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంద'ని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో ఘంటను కలిగిన వానరశ్రేష్టుణ్ణి దర్శించేప్పుడు, పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తుచేసుకోండి. 

'సింగిలీక వరదా…శ్రీరామచంద్రా' అని ప్రార్థించండి.

||జయ జయ ఆంజనేయ…జయ జయ శ్రీరామ||

||శ్రీరామ జయరామ జయజయ రామ||

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

హనుమంతుని కథలు, hanuman story in telugu pdf, హనుమంతుడు జీవిత చరిత్ర, hanuman story in telugu wikipedia, hanuman stories for kids, హనుమంతుని భార్య ఎవరు, about hanuman in ramayana in telugu, ఆంజనేయ, హనుమాన్ మంత్రం

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.