నవరాత్రులలో నాలుగవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం - అక్టోబర్ 18 2023 బుధవారం- మా కూష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ్ లలితా వ్రతం
కూష్మాండ ( కామాక్షి )
కూష్మాండా దుర్గా, నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. "కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్ధం.
ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.
కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి/సింహం.
మహాకాళీ
కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో, నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు, తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.
మహాలక్ష్మి
కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.
మహాసరస్వతి
కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి, తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని, తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.
శక్తి
కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే, ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి, నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు, శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.
బ్రహ్మ/లక్ష్మీ
కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.
ధ్యాన శ్లోకం
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం లో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృప లు అందుకోవాలి.
Related Posts:
> నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
> నవరాత్రుల్లో 2వ రోజు చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )
> నవరాత్రుల్లో 3వ రోజు చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )
> నవరాత్రుల్లో 4వ రోజు చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )
> నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )
> నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)
> నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )
> నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )
> నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )
> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం
కూష్మాండ, kushmanda devi mantra, kushmanda devi story, kushmanda devi color, kushmanda devi chalisa, kushmanda story telugu, vijayadasami, devi navaratrulu