Drop Down Menus

దుర్మరణం పాలైనవారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం..| Narayana Bali Puja, Importance & Benefit

దుర్మరణం పాలైనవారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం..

గరుడా! నారాయణ బలిని గూర్చి మరింత విపులంగా వినిపిస్తాను. వికృత మృత్యువు కారణంగా ప్రేతమై పోయిన వారికుత్తమ గతులు కలిగించే ప్రేతకర్మ మొకటుంది. ఇది రహస్యంగా వుంచబడింది. అయినా లోక కల్యాణం కోసం నువ్వడిగావు కాబట్టి దానిని వెల్లడిస్తున్నాను. దుర్మరణ మనగానేమో ఇదివఱకు చెప్పబడింది కదా!

వీరే కాక కొన్ని ఘోర పాపాలను చేసి నరకానికి పోయి శిక్షలననుభవించి కూడా ప్రేత యోనిలో పడిపోయిన వారుంటారు. వీరందరికీ ఉత్తమగతులనందించే మార్గం నారాయణ బలి ఒక్కటే. దానిని వివరిస్తున్నాను. బ్రాహ్మణులు మృతి చెందిన ఆరు మాసాలలోపున, క్షత్రియ వైశ్యులకు క్రమంగా మూడు, ఒకటిన్నర మాసాలలోపున శూద్రులకు తత్కాల పుత్తల దాహానంతరము దీనిని చేయాలి. గంగాది పుణ్య తీర్థాల నుండి ఇంటిలో లేదా దేవాలయంలో దాకా ఎక్కడైనా విష్ణుదేవుని ఎదురుగా పెట్టుకొని ఈ కర్మను నిర్వహింపవచ్చును. పౌరాణిక, వైదిక మంత్రాలతో ప్రేతానికి తర్పణలివ్వాలి. తరువాత యజమాని సర్వౌషధయుక్తజలంతో అక్షతలతో విష్ణుదేవునికి కూడా తర్పణలివ్వాలి. దీనికి పురుష సూక్తాన్ని గాని వైష్ణవ మంత్రాలను గాని చదవాలి. అనంతరం దక్షిణం వైపు తిరిగి ప్రేతాన్ని విష్ణురూపంగా తలచి ఈ క్రింది మంత్రంతో విష్ణువుని ధ్యానించాలి.

అనాది నిధనో దేవః శంఖ చక్రగదాధరః ॥ అవ్యయః పుండరీకాక్షః ప్రేత మోక్ష ప్రదోభవేత్ |

తర్పణ సమాప్తి కాగానే రాగముక్తుడై, ఈర్ష్యా ద్వేషరహితుడై, జితేంద్రియుడై, పవిత్రుడై, ధర్మపరాయణుడై, దానధర్మ సంలగ్నుడై, శాంతచిత్తుడై, ఏకాగ్రమనస్కుడై యజమాని విష్ణుదేవునికి సాష్టాంగ ప్రమాణం చేసి వాక్సంయమనాన్ని పాటిస్తూ తన బంధుబాంధవులతో సహా శుద్ధుడై భక్తిపూర్వకంగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి. సమాహితుడై బ్రాహ్మణులకు జలము, వరిధాన్యము, యవలు, చెఱకు, గోధుమలు, చిన్న కంకణం, శుభహవిష్యాన్నం, ముద్ర, గొడుగు, పాగా, బట్టలు, పాలు, తేనె- వీటన్నిటినీ దానమివ్వాలి. అలాగే వస్త్ర పాదుకాది ఎనిమిది పద దానాలను కూడా పంక్తి భేదం లేకుండా అందరు బ్రాహ్మణులకూ ఇవ్వాలి.

నేలపై పిండదానం పూర్తయిన తరువాత శంఖపాత్రతో రాగి గిన్నెతో వేరు వేరుగా గంధ అక్షత, పుష్పయుక్త తర్పణలివ్వాలి. ధ్యానధారణలతో మనసును ఏకాగ్రం చేసి మోకాళ్ళపై నిలబడి వేద శాస్త్రానుసారం బ్రాహ్మణులకు దానాలివ్వాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధాలలో ఋగ్వేద మంత్రాలను చదువుతూ విడివిడిగా పదకొండు పిండాలకు అర్ధ్యాలివ్వాలి : ఇలా:

ఆపోదేవీర్మధుమతీ...మొదటి

ఉపయామగృహీతో సి...రెండవ

యేనాపావక చక్షుషా...మూడవ

యే దేవాసః....నాలుగవ

సముద్రం గచ్ఛ....అయిదవ

అగ్నిర్ జ్యోతి....ఆరవ

హిరణ్యగర్భ....ఏడవ

యమాయ.....ఎనిమిదవ

యజ్ఞాగ్ర ....తొమ్మిదవ

యాఫలినీ.....పదవ

భద్రం కర్ణేభిః.....పదకొండవ పిండము

ఒక్కొక్క మంత్రం పూర్తిగా చదువుతూ అర్హ్యమిచ్చి ఆ పిండాన్ని విసర్జించాలి. ఇలా ఏకాదశ దైవత్య శ్రాద్ధాన్ని పెట్టిన మరునాడు శ్రాద్ధాన్ని ప్రారంభించాలి. నాలుగు వేదాలూ చదివినవారూ, విద్యాశీలురూ, సద్గుణ సంపన్నులూ, వర్ణాశ్రమ ధర్మపాలకులూ, శీలవంతులూ, శ్రేష్ఠులూ, సర్వాంగ సుశోభితులూ, ప్రశస్తులూనగు అయిదుగురు ఉత్తమ బ్రాహ్మణులనాహ్వానించాలి. బంగారంతో విష్ణునిదీ, రాగితో రుద్రునిదీ, వెండితో బ్రహ్మాదీ, ఇనుముతో యమునిదీ, సీసంతో లేదా కుశలతో ప్రేతానిదీ ప్రతిమలను తయారు చేయించాలి. శన్నోదేవీ... మంత్రాన్ని పూర్తిగా చదువుతూ విష్ణు ప్రతిమను పడమటి దిక్కులోనూ అగ్ని ఆయాహి... అనే మంత్రంతో రుద్ర ప్రతిమనుత్తర దిశలోనూ, అగ్ని మీళే... మంత్రంతో బ్రహ్మ ప్రతిమను తూర్పు దెసలోనూ, ఇషేత్వోర్జేత్వా....

మంత్రంతో యమ ప్రతిమను దక్షిణం వైపూ స్థాపించి వాటి మధ్యలో నొక మండలాన్నేర్పాటు చేసి కుశమయ (సీస) నరప్రతిమను దానిపైననూ స్థాపించాలి.

బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ, ప్రేతాలకై వేరు వేరుగా పంచరత్నయుక్త కుంభాలను సిద్ధం చేసి వుంచాలి. అలాగే విడివిడిగా వస్త్రాలనూ, యజ్ఞోపవీతాలనూ, ముద్రలనూ ప్రదానం చెయ్యాలి. దేవతల మంత్రాలను చదువుతూ వారిని పూజించాలి. జపం చేయాలి. తరువాత దేవతల నిమిత్తమై యథావిధిగా అయిదు శ్రాద్ధాలను పెట్టాలి. తరువాత శంఖ లేదా తామ్ర లేదా మట్టి పాత్రతో సర్వౌషధ సమన్విత తిలోదకాన్ని తీసుకొని అయిదు పీఠాల వద్ద ఉంచాలి. పక్షీంద్రా! ఆసనం, పాదుక, ఛత్రము, ఉంగరం, కమండలువు, పాత్ర, భోజన పదార్థాలు, వస్త్రము- ఈ ఎనిమిదింటినీ 'పదా'లంటారు. వీటి దానమే పద దానము. వీటితో బాటు బంగారంతో, దక్షిణ, తిలలతో నిండిన రాగిపాత్రను ముఖ్య బ్రాహ్మణునికి దానమివ్వాలి. ఋగ్వేద పారంగతుడైన బ్రాహ్మణునికి పచ్చటి పంటతో నున్న భూమినీ, యజుర్వేద నిష్ణాతుడైన విప్రునికి పాలిచ్చే ఆవునీ, సామవేద పారంగతుడైన, పాడగలిగిన బ్రాహ్మణునిలో శివుని ఊహించుకొని ఆయనకి స్వర్ణాన్నీ, యమునుద్దేశించి తిలలనూ, ఇనుమునూ, దక్షిణనూ ఇవ్వాలి.

సర్వౌషధి సమన్వితమైన కుశల ద్వారా నిర్మితమైన ప్రేత ప్రతిమను కృష్ణాజినం పఱచి దానిపై పెట్టి పలాశ దండం పుల్లలను మూడు వందల అరవై వృంతాలుగా ఎముకల వలె నిర్మించాలి. తల భాగంలో నలభై, మెడలో పది, ఎదపై ఇరవై, కడుపుకిరవై, భుజాలు, రెంటికీ వంద, కటికి ఇరవై, తొడలకు వంద, జంఘలకు ముప్పది, లింగానికి నాలుగు అండకోశాలకు ఆరు, కాలి వ్రేళ్ళకు పది వృంతాలను (కాడలను) కేటాయించి కల్పిత ప్రేతపురుషుని అస్థిపంజరాన్ని నిర్మించాలి. తరువాత దాని శిరోభాగంలో కొబ్బరికాయనీ, తాలు ప్రదేశంలో సొరకాయనూ నోటిలో పంచరత్నాలనూ, జిహ్వభాగంపై అరటిపండునూ, ప్రేగుల వద్ద తామరకాడలనూ, ప్రాణభాగంలో ఇసుకనీ, కొవ్వు స్థానంలో మేదకమను పేరు గల స్ఫటికమునూ మూత్రస్థానంలో గోమూత్రాన్నీ, ధాతువులకు బదులుగా గంధకాన్నీ, వీర్యస్థానంలో పాదరసమునూ, మలస్థానంలో ఇత్తడినీ, సంపూర్ణ శరీరమంతటా మనశ్శిలనీ, సంధి భాగాల్లో నువ్వు పిండినీ, మాంస భాగంగా యవల పిండినీ, తేనెనూ, ముత్యాల పొడినీ, కేశరాశి స్థానంలో మర్రి ఊడలనూ, చర్మ భాగంలో మృగచర్మాన్నీ, కర్ణ ప్రదేశాల్లో తాళపత్రాలనూ, స్తనభాగాలలో గురివింద పండ్లనూ, ముక్కుండే చోట కమల పత్రాలనూ, బొడ్డుచోట కమలపత్రాలనూ, అండకోశ స్థానంలో వంకాయలనూ, లింగ స్థానంలో ముల్లంగినీ అమర్చి నాభి కమలపత్రాలలో నేతిని పోయాలి. తరువాత కౌపీన స్థానంలో త్రపువునీ, రెండు స్తనాల వద్దా ముక్తాఫలాలనీ, తలపై కుంకుమ లేపనాన్నీ, కర్పూర, అగరు, ధూప, సుగంధిత పుష్పమాలల అలంకరణాన్నీ ఏర్పాటు చేయాలి. పరిధాన స్థానంలో పట్ట సూత్రాన్నీ, హృదయభాగంలో రజతపత్రాన్ని అమర్చాలి. యజమాని బుద్ధి, వృద్ధి అను సిద్ధులను సంకల్పించి భుజాలను (ప్రేతానివి) స్పృశించి దాని కన్నులలో ఒక్కొక్క గవ్వనుంచాలి. తరువాత కనుకొలకులలో సింధూరాన్నుంచి దాని పక్కనే తాంబూలాది వివిధ ఉపహారాలను అందంగా అమర్చాలి.

ఈ ప్రకారంగా నానా వస్తువులచే నిర్మింపబడి అలంకరింపబడిన ప్రేతానికి సర్వౌషధి జల ప్రదానం చేసి శాస్త్రానుసారము పూజ చేయాలి. అది అగ్నిహోత్రి ప్రేతమైతే దానికి యథావిధి యజ్ఞపాత్రను కూడా ఇవ్వాలి. తరువాత శిరోమేశ్రీ..., పునంతువరుణ... అనే మంత్రాలతో, యజమాని, అభిమంత్రిత జలం ద్వారా శాలగ్రామ శిలను కడిగి దానితోనే ప్రేతాన్ని పవిత్రీకరించాలి. తరువాత విష్ణుభగవానునిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పాలిచ్చే సుశీలయైన గోవును దానం చెయ్యాలి. తిలలు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఈ దానాలు ఈ క్రమంలో ఒకదానిని మించి - మరొకటి పుణ్యదాయకాలు. యజమానికీ గోదానం తరువాత, తిలాదాన పద దాన మహాదానాలను కూడా చేయాలి. చివరగా సర్వాలంకార విభూషితమైన ఒక వైతరణీ ధేనువును కూడా దానం చేయాలి.

ఈ సందర్భంలో, ప్రేతముక్తి కోసం, దాని ఆత్మీయుడైన యజమాని విష్ణు భగవానుని నిమిత్తమై ఒక శ్రాద్ధాన్ని పెట్టాలి. తరువాత మనసులో విష్ణుదేవుని ధ్యానిస్తూ, ప్రేతమోక్షక కార్యాన్ని చేపట్టాలి. అంటే విష్ణురితి... అనే మంత్రం చదువుతూ ప్రేతాన్ని దహనం చేసి మూడురోజులపాటు సూతక దినాలను పాటించాలి. పదవరోజు కర్మ, దానికి ముందు పిండదానాలు, వార్షిక క్రియాదులను పద్ధతి ప్రకారం చేస్తుండాలి. ఇది ప్రేతానికి ముక్తిని కలిగించే మానవ ప్రయత్నం.

Famous Posts:

మోక్ష నారాయణ బలి పూజ సంక్షిప్త వివరములు

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

Tags: నారాయణ బలి పూజ, Narayan Bali Puja, Narayan Bali Pooja Telugu, Narayana Bali, Narayana, Moksha Narayana Bali, Narayan Nagbali

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.