Drop Down Menus

భారత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి? Dwadasha Jyotirlingalu in Telugu - 12 Jyotirlingas in India

సోమనాథ జ్యోతిర్లింగము

శ్లో॥ సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |

భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ సోమనాథ ఆలయం గుజరాత్లోని “కతియవాడ” క్షేత్రంలోని సముద్రతీరంలో ప్రతిష్ఠించబడివుంది. దీనినే ఇదివరకు ప్రభాస క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఇక్కడి జ్యోతిర్లింగం గురించి ఓ పురాణగాధ వుంది.

దక్షప్రజాపతి తన ఇరవైఏడు మంది కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు మాత్రం దక్షుని చిన్నకుమార్తె అయిన రోహిణిపైనే ఎక్కువ ప్రేమానురాగాలతో వుండేవాడు. ఇది గమనించిన దక్షుడు తన అల్లునికి ఎన్నోవిధాల నచ్చచెప్పి చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఉగ్రుడైన దక్షుడు చంద్రుని భయంకరమైన క్షయ వ్యాధిగ్రస్తుడవు కమ్మని శపించాడు.

ఆశాపానికి చంద్రుడు సమస్త జగంపై తన సుధాశీతలత్వాన్ని వర్షించే శక్తిని కోల్పోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మృత్యుంజయ భగవానుని ఆరాధిస్తే శాపవిమోచనమవటమే కాకుండా వ్యాధినుండి విముక్తి లభిస్తుందని చెపుతాడు. మృత్యుంజయుడైన శివునికోసం చంద్రుడు తపస్సుచేయగా అమరత్వం కలిగేలా వరమిచ్చి దక్షుని మాటప్రకారం నెలలో పదిహేనురోజులు నీకళ తగ్గిపోతుంది.

మనో పదిహేనురోజులు నీకళ రోజురోజుకీ పెరుగుతూ వెన్నెల వెలుగులు పంచుతావు అని శివుడు చెప్పడంతో సంతోషించిన చంద్రుడు “నీవు పార్వతీదేవితో సహా ఇక్కడే కొలువుండాలని” శివుని ప్రార్థిస్తాడు.

చంద్రుని కోరికమేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో పార్వతీసమేతంగా అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. చంద్రునికి సోముడనే పేరు వుంది. చంద్రుడు శివుణ్ణి తననాథుడిగా భావించి అక్కడ తపస్సు చేశాడు. కాబట్టి ఆ జ్యోతిర్లింగం సోమనాథు డుగా ప్రసిద్ధి పొందింది.

మల్లికార్జున జ్యోతిర్లింగము

శ్రీశైలశృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే. పి ముదావతంసమ్ |

తమర్జునంమల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్రసేతుమ్ ॥

శ్రీ మల్లికార్జున ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో శ్రీశైల శిఖరంపై నిర్మించబడివుంది. ఇది దక్షణ కైలాసంగా పేరుగాంచింది. ఈ జ్యోతిర్లింగం గురించి, ఈ పర్వత మాహాత్మ్యం గురించి పురాణగాథలున్నాయి.

శివుని కుమారులైన కార్తికేయుడు, గణపతి తమకు వివాహం జరిపించమని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళతారు. ఎవరికివారు ముందుగా నా వివాహమే జరిపించాలని పట్టుబడతారు. దాంతో వారిద్దరికీ పార్వతీ పరమేశ్వరులు ఓ పరీక్ష పెడతారు. ఇద్దరిలో ఎవరు ముందుగ సమస్త భూమండలాన్ని చుట్టివచ్చి తమ వద్దకు చేరుకుంటారో వారి వివాహం ముందుగా చేస్తామని చెపుతారు.

కార్తికేయుడైన కుమారస్వామి తన నెమలివాహనాన్ని తీసుకొని ప్రదక్షిణచేసి రావాలని త్వరత్వరగా బయలుదేరి వెళతాడు. గణపతి స్థూలకాయుడవటం వలన, అందులో ఆయన వాహనం మూషికం అవటం వలన కుమారస్వామిలాగ వేగిరపడక, ఎదురుగా వున్న తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం కంటే శాస్త్రసమ్మతమయినది ఏది వుంటుందని? సూక్ష్మంతో తెలుసుకొని వారిచుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు.

కుమారుస్వామి తన భూప్రదక్షిణం పూర్తిచేసుకొని తిరిగి వచ్చేసరికి వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే ఇరువురు కన్యలతో వివాహం జరుగుతుంది. ఈ సంఘటనకు కోపంపట్టలేని కుమారస్వామి క్రౌంచపర్వతం మీదికి వెళ్ళిపోతాడు.

కుమారుని అలక తీర్చటానికి తల్లి పార్వతీదేవి కూడా అతని వెంటే వెళ్లింది. ఆమె వెనుకనే శంకరుడు కూడా వెళ్లి అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. అప్పటినుండి మల్లికార్జున జ్యోతిర్లింగ పేరుతో ప్రసిద్ధిపొందాడు. ఈ లింగాన్ని ప్రప్రథమంగా మల్లికాపుష్పాలతో అర్చనచేసే సంప్రదాయముంది.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ అవంతికాయాంవిహితావతారం ముక్తిప్రదానాయచ సజ్జనానామ్ |

అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశమ్ ||

పరమపవిత్రమైన ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ నగరంలో వుంది. క్షిప్రానదీతీరంలో ఉన్న ఈ ఉజ్జయినీ నగరానికి 'అవంతికాపురి’ అనే పేరుకూడా వుంది. ఇది భారతదేశంలోని పరమ పవిత్రాలయిన సప్తపురాలలో ఒకటి.

ఈ జ్యోతిర్లింగం గురించి ఓ పురాణ గాథ ప్రచారంలోవుంది. పూర్వం అవంతికాపురంలో వేదాధ్యయనపరుడు, తపోనిష్ఠా గరిష్ఠుడు, అత్యంత తేజశ్శాలి అయిన బ్రాహ్మణుడొకడుండేవాడు. అతనికి శివభక్తులైన నలుగురు కుమారులున్నారు. అక్కడికి సమీపంలోని రత్నమాల పర్వతాలపై దూషణుడు అనే దుష్టరాక్షసుడు తిరుగుతుండేవాడు.

అతడు బ్రాహ్మణుని తపస్సుకు భంగంచేయాలన్న తలంపుతో అక్కడకు వచ్చాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ వరాన్ని పొందిన మహాశక్తిశాలి కూడా. ఆ వరం పొందానన్న అహంతో దూషణుడు చేసే అకృత్యాలు ఎవరూ భరింపలేనివిగా వుంటాయి.

ముందుగా దుష్టదూషణుడు ఉజ్జయినీ నగరాన్ని ముట్టడించి అక్కడంతా అల్లకల్లోలం సృష్టిస్తాడు. శివభక్తులైన బ్రాహ్మణకుమారులు నలుగురూ తమ నగరాన్ని రక్షించమని శంకరుని వేడుకుంటారు.

వారలా శివుడిని ప్రార్థించడం సహించలేని రాక్షసుడైన దూషణుడు ఆగ్రహోదగ్రుడై ఆ నలుగురినీ అంతమొందించాలని అనుకుంటుండగా కళ్యాణకారకుడైన శివభగవానుడు తన హుంకారంతో ఆ దారుణ దుష్టరాక్షసుని అక్కడికక్కడే భస్మమొనర్చాడు.

భగవంతుడు అక్కడ హుంకారసహితంగా ప్రత్యక్షమవడం వల్ల ఆయనకు మహాకాలుడు అనే పేరు వచ్చింది. అందువల్లనే శివుడు ఇక్కడ మహాకాళేశ్వరుడు పేరుతో జ్యోతిర్లింగంగా వెలిసి అందరికీ ఆరాధ్యదైవమైనాడు.

ఓంకార జ్యోతిర్లింగము

శ్లో॥ కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ |

సదైవ మాంధాతృపురే వతంసం ఓంకారమీశం శివమేకమీడే ||

ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని పవిత్ర నర్మదానదీ తీరంలో వుంది. " ఈ ప్రదేశంలో నర్మదానది రెండుపాయలుగా చీలి మధ్యప్రదేశం ఒక ద్వీపంగా ఏర్పడింది. ఈ ద్వీపాన్ని మాంధాత పర్వతమని, శివపురి అని అంటారు.

నది నుండి ఒకపాయ పర్వతానికి ఉత్తరంవైపుగా, మరోపాయ దక్షిణంవైపుగా ప్రవ హిస్తుంది. దక్షిణంవైపు ప్రవహించేదే ప్రధానపాయగా గుర్తించబడుతోంది. ఈ మాంధాత పర్వతం మీద ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం నెలకొనివున్నది.

ప్రాచీనకాలంలో మాంధాత మహారాజు ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి శివ భగవానుని ప్రసన్నం చేసుకున్నాడు. ఓంకారేశ్వర జ్యోతర్లింగానికి రెండు స్వరూపా లున్నాయి. ఒకదానిని అమలేశ్వరనామంతో పిలుస్తారు.ఇది నర్మదానది దక్షిణ తీరంలో ఓంకారేశ్వరుడికి కొద్దిదూరంలో వుంటుంది.

వేరువేరుగా ఉన్నా రెండింటినీ ఒకటిగానే పరిగణిస్తారు. వీటికో పురాణగాథ వుంది. ఒకసారి నారదమహర్షి వింధ్యపర్వతం మీద తపస్సు చేస్తుండగా అతనికి వింధ్యపర్వతం కన్న పెద్దది ఈ ప్రపంచంలోనే లేదన్నంతగా కనబడటమేకాక అది ఓ పెద్ద మానవాకారంలో కనబడుతుంది.

ఐతే నారదుడు మేరుపర్వతమే వింధ్య పర్వతంకన్నా పెద్దదంటాడు. దాంతో వింధ్యపర్వతుడు నర్మదా నది ఒడ్డున శివుని గురించి గొప్ప తపస్సు చేస్తాడు. వింధ్య తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహిస్తాడు. వింధ్యాచలానికి వరిమిచ్చేవేళ సమస్తఋషులు, మునిగణం అక్కడికి విచ్చేస్తారు. వారి ప్రార్థనానుసారం శివభగవానుడు తన ఓంకారేశ్వర నామకలింగాన్ని రెండు భాగాలుగా చేశాడు. అలా ఒకదానికి ఓంకారేశ్వరుడు, రెండవ దానికి అమరేశ్వరుడు అనే పేరు వచ్చింది.

కేదారనాథ జ్యోతిర్లింగము

శ్లో॥॥ మహ్యాద్రి పార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీశం |

సురా సురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||

ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం పర్వతరాజైన హిమవంతుని కేదారనామక శిఖరంపై వుంది. ఇక్కడ ప్రకృతిశోభ ఆహ్లాదకరంగా వుంటుంది.

ఈ శిఖరం పశ్చిమభాగంలో పుణ్యమతి మందాకినీ నదీతీరంలో అవతరించిన కేదారేశ్వరమహాదేవమందిరం ఉంటుంది. శిఖరం తూర్పున అలకనందానదియొక్క సుందరతీరంలో బదరీనాథుని ప్రసిద్ధ మందిరంవుంది.

అలకనందానది, మందాకినీ నదులు రెండూ క్రిందికి వచ్చి రుద్రప్రయాగలో సంగమిస్తాయి. ఈ విధంగా పరమపవిత్ర గంగానదీస్నానంచేసే భక్తులకు కేదారేశ్వర, బదరీనాథుల చరణాలు కడిగిన జలాల స్పర్శ లభిస్తుంది.

హిమాలయాల్లోని కేదరనాథ శిఖరంపైన 'ధర్మ' కుమారులైన నరనారాయ ణులు అనేక సంవత్సరాలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరతపస్సు చేస్తారు. తపస్సు చేసినన్నాళ్ళు ఒంటికాలిమీద నిరాహారులై శివనామజపం చేస్తారు.

వారి భక్తికి తపస్సులోని నిమయ నిష్ఠలకు పరమశివుడు ప్రత్యక్షమై ఏవరం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. శివుని మాటలకు సంతోషించిన నరనారాయణులు “నీవు శివలింగ ఆకారంలో ఇక్కడే ప్రతిష్ఠితమవ్వాలి. నీ నివాసంతో ఈ ప్రాంతమంతా పరమపవిత్రంగా భాసిల్లుతుంది" అని భక్తితో చేతులు జోడించారు.

శివభగవానుడు వారి కోరికను మన్నించి మందాకినీ నదీ తీరంలోని నరనారాయణులు తనను ప్రార్థించిన ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాడు. ఈ మహాశివ జ్యోతిర్లింగం పర్వతరాజైన హిమవంతుని కేదారనామ శిఖరం మీద ఉండటం వల్ల ఇది కేదారనాథ జ్యోతిర్లింగంగా బహుళ ప్రాచుర్యం పొందింది.

భీమశంకర జ్యోతిర్లింగము

శ్లో॥ యం డాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ।

సదైవ భీమాది పదప్రసిద్ధే తం శంకరం భక్తసతం నమామి ||

పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూనాలో భీమనది ఒడ్డున ఉన్నది. భీమరాక్షస సంహారం ఇక్కడ జరగడం వల్ల శివుడు | భీమేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రసిద్ధిపొందాడు.

భీముడనే మహాప్రతాపశాలియైన రాక్షసుడు కామరూప ప్రదేశంలో తన తల్లితో కలిసి నివసిస్తూ వుండేవాడు. అతను రాక్షసేశ్వరుడైన రావణుని కనిష్ఠసోదరుడైన కుంభకర్ణుని కుమారుడు. అతని బాల్యదశలోనే శ్రీరామచంద్రునిచేత తన తండ్రి వధింపబడ్డాడన్న విషయం యుక్త వయసులో తెలుసుకుంటాడు.

విష్ణుభగవానుని అవతారమైన శ్రీరామునిపై కోపోద్రిక్తుడై అతనిపై పగతీర్చు కోవాలని ఉపాయాలు ఆలోచిస్తూంటాడు. అందుకోసం తపస్సు చేసి లోక విజేత అవాలని బ్రహ్మదేవుని నుండి వరంపొందుతాడు. తర్వాత కామరూపదేశ రాజైన సుదక్షిణ మహారాజుపై దండెత్తి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు.

మహారాజుని, అతని అనుచరవర్గాన్ని తన బందీలుగా చేసుకున్నాడు. భీముని కారాగార గృహంలోవున్న సుదక్షిణుడు తనకెదురుగా పార్థివశివలింగాన్ని వుంచుకుని భగవానుని ధ్యానంలో గడిపేవాడు. ఇది చూసిన రాక్షసుడు సహించలేక శివలింగంపై కత్తి దూశాడు.

అతని కరవాల స్పర్శకి శివలింగంలోని శంకరుడు ప్రత్యక్షమై మూడవకన్ను తెరవగానే భీముడు బూడిదయ్యాడు. ఈ అద్భుతకార్యాన్ని చూసిన ఋషులు,దేవతలు, పరమేశ్వరుని స్తుతించి, దేవదేవా, లోకకళ్యాణార్థం నీవు ఇక్కడే నివాసముండు. నీ నివాసం వల్ల ఇది పరమపవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కుతుంది. అని ప్రార్థించారు. అప్పటి నుండి అక్కడ భీమేశ్వరుడు జ్యోతిర్లింగంగా భక్తుల పూజలు అందు కుంటున్నాడు.

విశ్వనాథ జ్యోతిర్లింగము

శ్లో॥ సానందమానంద వనే వసంతం ఆనందకందం హతపాపబృందం |

వారణాసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

ద్వాదశజ్యోతిర్లింగాలలో విశ్వనాథ జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఈ జ్యోతిర్లింగం ఉత్తరభారతదేశంలోని కాశీనగరంలో నెలకొనివుంది. ఈ నగరానికి ప్రళయకాలంలో కూడా ఎలాంటి లోపమూరాదు.

ఆసమయంలో పరమేశ్వరుడు తన నివాసస్థలమైన ఈ నగరాన్ని త్రిశూలంమీద నిలుపుతాడు.సృష్టికి తొలిస్థలంగా ఈ నగరాన్ని పేర్కొంటారు. విష్ణుభగవానుడు తన సృష్టికార్య కలాపంలో తపస్సుచేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నది కూడా ఇక్కడే. అగస్త్యమహర్షి కూడా ఈ ప్రదేశంలోనే తపస్సుచేసి శంకరుని సంతుష్టుణ్ణి చేసుకున్నాడు.

ఈ పరమ పవిత్ర నగరానికి ఉత్తరాన ఓంకారఖండం, దక్షిణాన కేదారఖండం, మధ్యలో విశ్వేశ్వరఖండం వున్నాయి. ప్రసిద్ధ విశ్వేశ్వర జ్యోతిర్లింగం విశ్వేశ్వర ఖండంలో ప్రతిష్ఠితమైవుంది. శక్తికి స్త్రీరూపం పార్వతీమాత అని, పురుషరూపం శంకరుడని సాక్షాత్తూ ఆ పరమాత్ముడే స్పష్టంచేశాడు.

అందుకే వీరిని ఆదిదేవులనీ అంటారు. ఈ దైవశక్తులే స్త్రీపురుషుల సృష్టికి కారణమవుతున్నాయి. వారెప్పుడూ తమతల్లిదండ్రులను చూడకపోవడం వల్ల వేదన చెందుతారు. శక్తిదేవతకి తపస్సు చేస్తే మంచిదని దివ్యవాణి పలుకుతుంది.

ఆమెకి తను నిష్ఠగా తపస్సు ఆచరించడానికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. అపుడు శివభగవానుడు కాశీనగరాన్ని నిర్మించి అక్కడే విశ్వనాథుడి పేరుతో స్థిరనివాసం ఏర్పరచుకొంటాడు. అప్పటి నుండి విశ్వనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందాడు. వారణాశిలో గంగానది ఒడ్డున జ్యోతిర్లింగరూప ములో వున్న ఇక్కడి శివభగవానుడు కాశీవిశ్వనాథునిగా, కాశీవిశ్వేశ్వరునిగా అనంత భక్తకోటిచేత విశేషమైన పూజలందుకుంటున్నాడు.

తంబకేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే |

యద్దర్శనాత్ పాతక మాశునాశమ్ ప్రయాతితం త్ర్యంబకమీశమీడే ||

శ్రీత్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ లో నెలకొని వుంది. శివపురాణంలో ఈ జ్యోతిర్లింగానికి ఎంతో విశిష్టమైన స్థానంవుంది. ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమంలో నివసించే బ్రాహ్మణపత్నులకు ఆయన ధర్మపత్ని అహల్యపైన గౌతమునిపైన అసూయ కలుగుతుంది.

అప్పుడు వారందరూ తమ భర్తలను గౌతమ మహర్షికి అపకారం కలిగించేలా ప్రేరేపించారు. దీనికోసం ఆశ్రమంలోని బ్రాహ్మణు లందరూ విష్ణుదేవుడైన గణపతిని ఆరాధించి ప్రసన్నుని చేసుకొని గౌతమ మహర్షిని ఆశ్రమం నుండి వెడలగొట్టే వరమొసంగమని అడుగుతారు.

గణపతి విధిలేని పరిస్థితు లతో ధేనువు రూపాన్ని ధరించి గౌతముని పొలానికి చేరి అక్కడ గడ్డిమేస్తుంటాడు. పొలంలోని పంటనంతా మేస్తున్న గోవును చూసి మహర్షి సుకుమారంగా ఓ గడ్డి పరకతో దానిని అదిలిస్తాడు. ఆ స్పర్శకే గోవు ప్రాణాలు విడుస్తుంది.

గౌతముడు ఎంతో బాధపడి ఏదయినా ప్రాయశ్చితం చేసుకోవాలనుకొన్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, దుష్టులైన గౌతముని ఆశ్రమవాసులని అంతమొందించాలనుకుంటుండగా గౌతముడు వారి తప్పులను మన్నించమని వేడుకుంటాడు.

గౌతమ మహర్షి మాటలతో ఆగ్రహం తగ్గిన శంకరుడు గోదావరిని పిలిచి అక్కడ నివాసం ఏర్పరచుకోమంటాడు. గోదావరి అందుకు అంగీకరించి శివుడిని కూడా అక్కడే వుండమని కోరడంతో జ్యోతిర్లింగం రూపంలో అక్కడ వుండటానికి తన సమ్మతిని తెలియజేస్తాడు. అప్పటి నుండి శివభగవానుడు నాసిక్ లో త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కుతాడు.

వైద్యనాథ జ్యోతిర్లింగము

శ్లో॥ పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతమ్ |

సురా సురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||

ప్రసిద్ధమైన శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భిరిజిల్లాలోని పార్లిలో నెలకొనివుంది. ఒకసారి రాక్షసరాజు రావణాసురుడు హిమాలయానికెళ్ళి శివభగవానుని దర్శనార్థం అక్కడ ఘోరతపస్సు చేస్తాడు.

ఆ తపస్సులో ఒకదాని తర్వాత మరొకటిగా తన శిరస్సును ఖండించి శివలింగానికి అర్పణచేస్తుంటాడు. ఆ విధంగా తన తొమ్మిది తలలు ఖండించి శివార్పణం చేసి, పదవతలను కూడా ఖండించి శివలింగానికి అర్పించబోవగా పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

శిరస్సును ఖండించుకోబోతున్న రావణుని చేయి పట్టుకుని అతను చర్యను నివారించి, అంతకు ముందు తనకు అర్పించిన తొమ్మిది తలలను ఎప్పటిలా యధాస్థానంలో వుండేలా అనుగ్రహిస్తాడు. నీ తపస్సుకు మెచ్చానని ఏదైనా వరం కోరుకోమని ఆనతి ఇస్తాడు.

అప్పుడు రాక్షసరాజైన రావణాసురుడు తనకు ప్రీతిపాత్రమైన శివలింగాన్ని తన రాజధాని లంకానగరానికి తీసుకువెళ్ళేందుకు అనుమతివ్వమని కోరతాడు. ఆ వరం అనుగ్రహించి శివుడు ఓ షరతుకూడా పెడతాడు.

మార్గమధ్యంలో దీనిని ఎక్కడా క్రిందపెట్టకూడదని ఆ షరతు. రావణుడు ఆ షరతుకు అంగీకరించి శివలింగాన్ని తీసుకొని లంకానగరానికి పయనమవుతాడు. మార్గమధ్యంలో అనుకోని పరిస్థితులలో ఓ గోపబాలుని చేతిలో శివలింగం పెడతాడు. ఆ బాలునికి శివలింగం భారంగా తోచి తప్పనిసరి పరిస్థితిలో నేలపై పెడ్తాడు.

ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ శివలింగాన్ని పైకెత్తలేకపోతాడు. అలా ఆ శివలింగం వైద్యనాథ పేరుతో జ్యోతిర్లింగంగా అక్కడే ప్రతిష్ఠించబడి పూజలందుకుంటున్నాడు.

నాగేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః

సద్భక్తి ముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥

శివభగవానునికి ప్రసిద్ధిచెందిన ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో వుంది. పూర్వం సుప్రియుడనే పేరుగల గొప్ప ధర్మాత్ముడు, సదాచారుడు అయిన ఒక వైశ్యుడుండేవాడు. అతను శివభగవానుని అనన్యభక్తుడు, సుప్రియుడు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వర అర్చనలో ఆరాధనలో ధ్యాన నిమగ్నుడై వుండేవాడు.

తన సమస్త కర్మలూ శివునికే అర్పిస్తూ మనోవాక్కాయ కర్మల ద్వారా పరిపూర్ణంగా శివధ్యానంలోనే గడిపేవాడు. ఇతని శివభక్తిని చూసి దారుకుడు అనే రాక్షసుడు సహించలేకపోయాడు. సుప్రియుని శివపూజలు ఏరకంగానూ నచ్చేవికావు.

అతని శివపూజలు ఎలాగయినా నిరోధించాలని పట్టుదలతో వుంటాడు. ఒకసారి సుప్రీ యుడు ఓ పడవలో ప్రయాణం చేయడం దారుకుని కంటపడింది. ఇదే అదనను కొని ఆ నౌకను ముట్టడించి సుప్రియుడ్ని మిగిలిన యాత్రీకులని బంధించి తన రాజధానికి తీసుకెళ్ళి బందీలుగా వుంచుతాడు. బందీగావున్న సుప్రియుడు శివపూజలు చేయలేదనుకుంటాడు. కానీ సుప్రియునికి కారాగారంలో కూడా నియమానుసారంగా శివారాధనలు అర్చనలు కొనసాగిస్తూంటాడు.

అది తెల్సుకొన్న దారుకుడు అతడ్ని సంహరించబోతే శివుడు జ్యోతిర్లింగరూపంలో ప్రత్యక్షమయి సుప్రియుడికి పాశు పతాస్త్రాన్ని అందిస్తాడు. ఆ అస్త్రంతో సుప్రియుడు రాక్షసుడైన దారుకుడ్ని వధించి శివధామానికి చేరుకున్నాడు.

శివభగవానుని ఆదేశానుసారంగానే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వరుడనే పేరు వచ్చింది. అందుకే ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగంగా అప్పటి నుండి ప్రసిద్ధిచెంది శివభక్తులచేత విశేషమయిన పూజలందుకుంటోంది.

రామేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖ్యై |

శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి||

శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో నెలకొనివుంది. ఈ జ్యోతిర్లింగ ప్రతిష్ఠ పురుషోత్తముడైన శ్రీరాముని ద్వారా జరిగింది. సీతాన్వేషణలో శ్రీరామచంద్రుడు లంకకు పయనమయి వెళుతుండగా దాహార్హుడై హిందూమహా సముద్రం చివరకు చేరుకున్నాడు.

అక్కడ దాహం తీర్చుకోబోతుండగా, ఆకాశవాణి మాటలు ఈ విధంగా వినిపిస్తాయి. “నన్ను పూజించకుండానే జలపానం చేస్తున్నావా” అని అప్పుడు వెంటనే శ్రీరాముడు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి భక్తిగా పూజలు నిర్వహిస్తాడు.

అందుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణుని కబంధహస్తాల నుండి సీతను త్వరలోనే విడుదల చేస్తానని రామునికి ఆశీస్సులంద చేస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని గురించి మరోకథ కూడా వుంది.

రావణవధానంతరం తనను దర్శించిన ఋషి, ముని పుంగవులతో రాముడు “రావణుని వధించిన పాపానికి ఏదైనా ప్రాయశ్చితం చెప్పమ”ని కోరతాడు. వారంతా శివలింగాన్ని ప్రతిష్ఠించమని సూచిస్తారు.

హనుమంతుడు శివలింగం తీసుకురావడానికి కైలాసపర్వతానికి వెళ్లి వచ్చేసరికి సమయం మించిపోతుందేమోనన్న భయంతో అక్కడ సీతాదేవితో శివలింగ ప్రతిష్ఠ జరిపిస్తాడు. అదిచూసి బాధపడిన హనుమంతునితో, “నువ్వు కావాలనుకుంటే ఈ లింగాన్ని ఇక్కడ నుంచి పెకలించు అంటాడు శ్రీరాముడు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోగా ఆ లింగానికి క్రోసుడుదూరంలో పడి మూర్ఛపోతాడు.

కొద్దిక్షణాల తర్వాత తేరుకున్న హనుమంతునకు శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్క రించాడు. అది శంకరుని మహిమగా గుర్తించి అంతా శివుడిని కీర్తిస్తారు.

ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ ఇలాప్రదేశే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |

వందేమహోదారతర స్వభావం ఘుష్టేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥

ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో వుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఆఖరి జ్యోతిర్లింగం. దీనికి ఘుశ్మేశ్వరుడు, ఘుృణేశ్వరుడు అనే పేర్లు కూడా వున్నాయి. ఈ జ్యోతిర్లింగాన్ని గురించి ఓ పురాణగాధ ప్రచారంలో వుంది.

దక్షిణదేశంలో దేవగిరి పర్వత సమీపంలో సుధాముడనే అత్యంత తేజశ్శాలి, తపోనిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్యపేరు సుదేహ. వారిద్దరూ అన్యోన్యంగా ఎంతో ప్రేమగా వుంటూ సంసార జీవనం సాగిస్తుండేవారు.

కానీ ఎంతకాలానికీ వారికి సంతానం మాత్రం కలుగలేదు. సుదేహ సంతానం కావాలని ఎంతగానో పరితపించిపోయేది. సంతానంకోసం ఆమె పట్టుబట్టి సుధామునికి తన చెల్లెలితో ద్వితీయ వివాహం జరిపించింది. భార్య సుదేహ కోరిక, పట్టుదలపై ఆమె చెల్లెలు ఘుశ్మను పెళ్ళిచేసు కుంటాడు సుధాముడు.

ఆమె శివభగవానుని భక్తురాలు. ఆ పరమేశ్వరుని కృపవలన ఆమెకు పుత్రుడుదయించాడు. ఇది సుదేహకు అసూయ కలిగించింది. చివరికి ఆమె ఆ బాలుణ్ణి అంతమొందించేందుకు కూడా వెనుకాడలేదు. ఘుశ్మాదేవి అన్నింటికీ భగవానుడీ వున్నాడనుకొని శివార్చనలో నిమగ్నమైంది.

శివుడు ప్రత్యక్షమై ఆమె బిడ్డను ఆమెకు తిరిగి ఇవ్వటమేకాక ఇంతటి అకృత్యానికి పాల్పడిన సుదేహను శపించబోతుంటే ఘుశ్మ అడ్డుతగిలి తన సోదరిని క్షమించమని వేడుకుంది. అంతేకాదు, లోకకళ్యాణార్థం ఆ దేవదేవుడిని అక్కడే కొలువై వుండాలని కోరింది.

ఆమె కోరికను మన్నించాడు శివుడు. ఘుశ్మాదేవి ద్వారా ఆరాధించబడ్డ కారణంగా శివుడు అక్కడ ఘుశ్మేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిపొందాడు.

Related Posts:

జ్యోతిర్లింగాలు ఎలా దర్శించాలి?

ద్వాదశ జ్యోతిర్లింగాలు - ఒక్కో రాశికి ఒక్కోలింగం

శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫలితాలు.

మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు.

శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకోండి.

Tags: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగాలు, jyotirlinga, 12 jyotirlingas names, Dwadasa Jyotirlingas, Dwadasa Jyotirlinga, Jyotirlinga Temples, Dwadasha Jyothirlinga Stotram, 12 Jyotirlingas in India

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments