దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి? Deeparadhana
దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?
పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూ-తత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి, దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే.
దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం.
దీపానికి ఉండే మరో ప్రత్యేకత.. అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.
సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు.
విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.
‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్’’* అన్నారు ఋషులు. అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.
ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. *‘పరమాత్మే పరంజ్యోతి’* అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞస్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం.
లౌకికంగా చెప్పాలంటే, - *మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భకి’్త అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.
దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు.
'దీపేన సాధ్యతే సర్వం'_ అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం - అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి - ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది.
ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహితులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.
కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.
భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేదవేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే... కానీ, అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే ‘దీపం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తూ ఆరాధిస్తారు. ‘వెలిగించడం’ సనాతన భారతీయ సంస్కృతి.
మంత్రశాస్త్రం ప్రకారం *‘సాక్షాత్ దీపం దర్శయామి’* అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు.
పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ, నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ, ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
Tags: దీపారాధన, Deeparadhana, Benefits Of Deeparadhana, Deeparadhana mantra, Deeparadhana kundulu, Deeparadhana oil, Deeparadhana Benefits Telugu, Lamp, Pooja, Daily Pooja
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment