మహాలయ అమావాస్య ప్రతి ఒక్కరు ఈ పని చేస్తే చాలు | పితృదేవతలకు ఇష్టమైనరోజు మహాలయ అమావాస్య..
పూర్వీకుల ఆత్మలకు శాంతి మరియు మోక్షం కోసం ఆచారాలను నిర్వహించడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి అమావాస్య (అమావాస్య రోజు) ఒకరి పూర్వీకులను గౌరవించటానికి అంకితం చేయబడినప్పటికీ, పితృ పక్షం సమయంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2024లో, పితృ పక్షం ముగింపుగా అక్టోబర్ 2న మహాలయ అమావాస్య జరుపబడుతుంది.
పితృదేవతలకు.. ఆకలా..?
అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః
అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే.. అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే.. దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.
మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి .. అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.
మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే.. పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..
మహాలయ అమావాస్య నాడు పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథి గా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షం లో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు.శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి.
శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మ లో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారం గా తెలుసుకోవచ్చు.
"యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.
అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.
కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.
Tags: Mahalaya Amavasya, Pitru Paksha , మహాలయ అమావాస్య, పితృకర్మలు, Mahalaya Amavasya 2024, 2024 Amavasya, Pitru Paksha, mahalaya amavasya date, Mahalaya Amavasya,