Drop Down Menus

Famous Temples information in East Godavari District || తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల వివరాలు |

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల వివరాలు










అన్నవరం :
శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు కొలువైన క్షేత్రం అన్నవరం.  ఈ క్షేత్రం పంపా నది ఒడ్డున ఉంది.  ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు , రైల్వే సదుపాయం ఉంది. అన్నవరం లో రైల్వే స్టేషన్ కలదు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పేరు వినేవుంటారు కదా .. అన్నవరం కొండనే రత్నాచలం అని పిలుస్తారు. ఈ క్షేత్రం పేరు మీదే రత్నాచల్ ఎక్ష్ప్రెస్స్ అని పేరుపెట్టారు. ఈ ప్రాంతం లో వివాహం అయినవెంటనే అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం ఆనవాయితీ. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్రతాలూ చేస్తారు. మనం కూర్చుండే మండపం బట్టి  టికెట్స్ ధరలు ఉంటాయి . ప్రస్తుతం 300,800,1500,2000 రూపాయల టికెట్స్ ఉన్నాయి . అన్నవరం కొండపైకి  చేరుకోవడానికి బస్సు మార్గం  మరియు మెట్లమార్గం ఉన్నాయి. మెట్లమార్గం ద్వారా చేరుకోవడం సులువుగానే ఉంటుంది మొత్తం 460 మెట్లు ఉంటాయి . ఈ క్షేత్రానికి శ్రీ సీతారాములు క్షేత్ర పాలకులుగా ఉన్నారు. ప్రసాదం కౌంటర్స్ ఎదురుగా సీతారాముల ఆలయం ఉంది. వనదుర్గ అమ్మవారి సన్నది కనకదుర్గ అమ్మవారి ఆలయం ఉన్నాయి. అన్నవరం ప్రసాదం చాల ప్రసిద్ధి. గోధుమ నూకతో చేసే ప్రసాదం భక్తులు చాల ఇష్టం గా తింటారు.  అన్నవరం  ప్రసాదాన్ని ఇస్తరి ఆకులలో పెట్టి ఇస్తారు, దూరప్రాంతం వారి కోసం భంగి ప్రసాదాన్ని కూడా తయారుచేస్తున్నారు. ఈ ప్రసాదం త్వరగా పాడైపోకుండా ఉంటుంది.  కొండ క్రింద చాలానే హోటల్స్ , లాడ్జిస్ ఉన్నాయి రూమ్స్ కొరకు పెద్దగా ఇబ్బంది ఉండదు.  దేవస్థానం రూమ్స్ కూడా కొండపైన ఉన్నాయి మనం నేరుగా వెళ్లి బుక్ చేస్కోవచ్చు. 

ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది.

ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు. 

అన్నవరానికి దగ్గర్లో గల క్షేత్రాలు తలుపులమ్మ లోవ 16 కిమీ , పిఠాపురం 30 కిమీ  , తొలి తిరుపతి 40 కిమీ  , రాజమండ్రి 80 కిమీ , కాకినాడ 42 కిమీ,  ద్రాక్షారామం 72 కిమీ దూరంలోను ఉన్నాయి. అన్నవరం నుంచి వైజాగ్ 110 కిమీ దూరం లోను ఉంది. 


తొలి తిరుపతి 
9000 సంవత్సరాల పురాతన ఆలయంగా చెప్పబడుతుంది. స్వామి వారి పేరు శ్రీ శృంగార వల్లభ స్వామి స్వయంభు మూర్తి. స్థలపురాణం ప్రకారం ధృవుని తపస్సు కు మెచ్చి స్వామి వారు ప్రత్యక్షమైన ప్రదేశం, ఈ ఆలయం లో స్వామి వారి శంకు చక్రాలు అపసవ్య దిశలో ఉంటాయి. ఎవరు ఎంత ఎత్తులో వారికి అంతే ఎత్తులో స్వామి వారు కనిపిస్తారు. స్వామి వారు ఆ రోజు చిన్నపిల్లవాడైన ధ్రువుడు తపస్సు చేయడం చూసి మురిసిపోతూ నవ్విన ఆనవ్వు మనకు ఇంకా అలానే కనిపిస్తుంది. ప్రతి శనివారం ఈ ఆలయం చాల రద్దీగా ఉంటుంది. ఆలయానికి కుడివైపున ఒక భావి కలదు ఆ నూతి లో భక్తి శ్రద్ధలతో  స్నానం చేసి , స్నానం చేయడానికి వీలు లేనప్పుడు నీళ్ళైనా తలపైన జల్లుకుంటే పుత్రసంతానం కోసం ఎదురుస్తున్న వారికి ఆ కోరిక తీరుతుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం చాల పురాతనమైన ఆలయం , ఆలయ స్తంబాలపైనా రాసిన శాసనాలు చదవానికి వీలులేకుండా ఉన్నాయి . తిరుపతి చేరుకోవడానికి సామర్లకోట నుంచి లేదా పిఠాపురం నుంచి లేదా కాకినాడ నుంచి దివిలి చేరుకోవాలి . దివిలి నుంచి 2 కిమీ దూరం లోనే ఈ క్షేత్రం కలదు. దివిలి వరకు చేరుకోవడానికి బస్సు లు ఆటో లు ఉంటాయి . దివిలి నుంచి ఆటో లు ఉంటాయి. సామర్లకోట నుంచి 15 కిమీ , పిఠాపురం నుంచి 13 కిమీ , కాకినాడ నుంచి 25 కిమీ దూరం ఉంటుంది. 

ద్రాక్షారామం : 
ద్రాక్షారామం అని పిలుచుకుంటున్న అసలైన పేరు దక్ష రామం . శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే దాక్షారామం . పరమశివునికి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానంపాలైన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువుగా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.

ఉదయం 5 గంటలకు సుప్రభాతం తో పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి . మధ్యాహ్నం 12.15 ని ల నుంచి 3 గంటల వరకు విరామం ఉంటుంది . మరల 3 గంటల నుంచి  రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచివుంటుంది. 

దాక్షారామం కాకినాడ కు 32 కిమీ దూరం లోను , రాజమండ్రి కి 60 కిమీ దూరం లోను , పిఠాపురం పాదగయ క్షేత్రానికి 48 కిమీ దూరం లోను సామర్లకోటకు 40 కిమీ దూరం లోను ఉంటుంది. ద్రాక్షారామం నుంచి కోటిపల్లి 10 కిమీ దూరం లో ఉంటుంది .

సామర్లకోట 
కుమారభీమారామము పంచారామ క్షేత్రాలలో ఒకటి.  పంచారామ క్షేత్రాలలో  రెండు తూర్పుగోదావరి జిల్లాలోను  , రెండు పశ్చిమ గోదావరి జిల్లాలో  , ఒకటి  గుంటూరులోను కలదు. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి 1 కిమీ దూరం లోనే ఈ క్షేత్రం కలదు.  చాళుక్య రాజైన  భీముడు ఈ ఆలయాన్ని మరియు ద్రాక్షారామ క్షేత్రాన్ని నిర్మించాడని చెబుతారు. అందుకే నిర్మాణంలో ఈ రెండు ఆలయాలు ఒకే విధంగా ఉండటమే కాకుండా , నిర్మాణానికి ఒకే రాయి కూడా వాడారు . 
ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది.  

గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏక శిలచే చెక్కబడింది.ఆలయంలోని మండపం నూరు రాతిస్తంభాలనుకలిగి ఉంటుంది.రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. 

ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మరల సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. సామర్లకోట లో రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి వైజాగ్ నుంచి విజవాడ మధ్య నడిచి అన్ని ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి. హైదరాబాద్ వాళ్ళకి  గౌతమీ , బెంగళూరు వాళ్ళు శేషాద్రి , తిరుపతి వాళ్ళు తిరుమల మరియు శేషాద్రి ఎక్ప్ ప్రెస్ , చెన్నై వాళ్ళు సర్కార్ ట్రైన్ ఎక్కి సామర్లకోట చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రైన్ లో 4 గంటలు ప్రయాణం .  విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ లు విజయవాడ మీదుగా  ఏలూరు - రాజమండ్రి - సామర్లకోట లో ఆగుతాయి .

సామర్లకోట నుంచి పెద్దాపురం 5 కిమీ ,  పిఠాపురం 13 కిమీ , తొలి తిరుపతి 15 కిమీ , బిక్కవోలు 17 కిమీ ,  కాకినాడ 15 కిమీ , గొల్లలమామిడాడ 20 కిమీ , ద్రాక్షారామం 40 కిమీ , రాజమండ్రి 50 కిమీ దూరం లోను ఉన్నాయి. 


పిఠాపురం
అష్టాదశ శక్తిపీఠాల్లో 10 వ శక్తి పీఠమైన పురుహూతికా అమ్మవారి క్షేత్రం  పిఠాపురం లో   కలదు.  ఈ శక్తి పీఠం పిఠాపురం లో  ఎక్కడుంది అనే అంశం లో వివాదం ఉంది. పిఠాపురం పాదగయ క్షేత్రం ఆలయ ప్రాంగణం లో ఉంది అని అంటునప్పటికీ అసలైన శక్తిపీఠం పిఠాపురం పాత బస్సు స్టాండ్ దగ్గర్లో ఉందని స్థానికులు చెబుతున్నారు. పిఠాపురం పాత బస్సు స్టాండ్ / పెట్రోల్ బ్యాంకు దగ్గర 10 వ శక్తి పీఠం ముఖద్వారం కూడా మనకు కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు రెండు చోట్ల దర్శనం చేస్కుని వెళ్తుంటారు .  పిఠాపురం పాదగయ క్షేత్రం త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. పాదగయ క్షేత్రం లో శివుని పేరు శ్రీ కుక్కుటేశ్వరుడు అమ్మవారి పేరు రాజరాజేశ్వరి అమ్మవారు. పిఠాపురం లో గల కుంతీ మాధవ క్షేత్రం పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి. దత్తాత్రేయుని అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థానం పిఠాపురమే. పిఠాపురం లో కొత్తగా వేసిన ఫ్లై ఓవర్ కారణంగా ఇప్పుడు ఆర్.టి సి. బస్సు లు పాదగయ క్షేత్రం దగ్గరే ఆగుతున్నాయి.  పిఠాపురం లో గల లోకల్ టెంపుల్స్ ని చూపించడానికి ఆటో లు ఉంటాయి 200 నుంచి 250 వరకు తీసుకుంటారు . ఆటో లో 4 కూర్చుకోవచ్చు . పిఠాపురం నుంచి అన్నవరం 27 కిమీ , సామర్లకోట 13 కిమీ , కాకినాడ 15 కిమీ , తోలి తిరుపతి 15 కిమీ దూరం లోను ఉంది. 

పెద్దాపురం 
పెద్దాపురం లో పాండవుల మెట్ట ఉంది, పాండవులు అరణ్యవాసం చేసే సమయం లో పాండవులు ఇక్కడ కొద్దికాలం ఉన్నారని చెబుతారు . ఇక్కడ భీముని పాదాలు ఉన్నాయి. పాండవులు ఇక్కడ నుంచి రాజమండ్రి స్వరంగా మార్గం లో వెళ్లి గోదావరి లో స్నానం చేసి వచ్చేవారని చెబుతారు . కొండపైన పాండవుల గుహ ఉంది. ఇప్పుడు గబ్బిలాలతో నిండిపోయింది. పూర్వం చాల లోతుగా ఉండేదని ఇప్పుడు చాలాభాగం మట్టితో కప్పిపడిపోయిందని చెబుతారు . మెట్టపైన సూర్యనారాయణ స్వామి ఆలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా కలదు ఇక్కడ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి . పెద్దాపురం లో గల మరిడమ్మ వారి ఆలయం చాల ప్రసిద్ధి ఈ ఆలయం. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసములోఒక నెల పాటు జాతర జరుపబడును. ఈ ఆషాఢ మాసము మొత్తం పెద్దాపురం పట్టణములో పండుగ వాతావరణము కనపడును. ప్రతీ ఆదివారం పట్టణములోని ఒక్కొక్క వీధి చొప్పున వంతుల వారీగా సంబరము జరుపుదురు.

పెద్దాపురం నుంచి కాండ్రకోట నూకాలమ్మ వారి ఆలయం 10 కిమీ దూరం లో , సామర్లకోట 5 కిమీ, రాజమండ్రి 40 కిమీ దూరం లోను కలదు . 

బిక్కవోలు : 
బిక్కవోలు సామర్లకోట నుంచి 17కిమీ దూరం లో ఉంది. బిక్కవోలు గ్రామం లో గల వినాయకుని దేవాలయం శ్రీ గోలింగేశ్వర స్వామి  కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాల పురాతనమైన విశేషమైన ఆలయాలు .స్థలపురాణం ఈ విధంగా ఉంది శ్రీ గోలింగేశ్వరస్వామి మొదట బిరుదాంకపురంలో మంద బయలు భూమిలో కప్పబడి వుండేది. గ్రామంలో ఉన్న ఓ రైతు యొక్క ఆవు ప్రతి నిత్యము తన పాలు ఈ లింగాకారం వున్న ప్రదేశములో కార్చి వెళ్ళిపోయేది. రైతు ఆవు పాలు ఇవ్వక పోవడంతో అనుమానం పడి తన పాలికాపుని ఆవుని కంటకనిపెట్టి వుండమని చెప్పాడు. పాలికాపు ప్రతి రోజులాగే ఆవుల మందలో ఉన్న ఆవును వదిలాడు. తర్వాత పాలికాపు ఆ ఆవుని గమనించిన అక్కడక్కడ మేత వేస్తూ తిన్నగాలింగాకారంవున్న ప్రదేశానికి వచ్చి అక్కడ పాలుకార్చిన తరువాత మేత మేస్తూ ప్రక్కలకు పోయింది. అది చూసిన పాలికాపు ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు కార్చిన పాలు ఉన్నాయి. ఆవులకాపరి సాయంకాలం దూడలను తిరిగి ఇండ్లకు తోలుకొచ్చి వాటి స్థానాల్లో వాటిని కట్టేసి తన రైతుకు జరిగింది అంతా చెప్పాడు. రైతు ఈ విషయాన్ని గ్రామంలోని ఉన్న వారికి చెప్పాడు. గ్రామస్తులు అంతా పాలుకార్చిన ప్రదేశానికి వెళ్ళి, అక్కడ పాలు కట్టిన చిన్నమడుగుని చూశారు. దానితో పాలు మడుగుకట్టిన భూమిలోపల ఏ దేవుడో, దేవతో ఉండవచ్చు అనీ భావించి గ్రామస్తులంతా మంచి ముహూర్తంలో అక్కడ త్రవ్వారు అక్కడ పానమట్టంతో సహా లింగము బయటపడింది. బిరుదాంక మహారాజు గుడి కట్టించడానికి ముందుకొచ్చి పునాదులు త్రవ్వుతుంటే ఆ పునాదుల్లో పుట్టబయలుదేరింది. దాన్ని త్రవ్వితే కొద్ది మరోపుట్ట పుట్టింది. అలా ఎన్ని సార్లు త్రవ్వినా పుట్టపుట్టుకొస్తూనే వుంది ఆ పుట్టను అలాగే వుంచి తిరిగి పునాదులు త్రవ్వుతుండగా కుమార సుబ్రమణ్యే శ్వర స్వామి విగ్రహం బయటపడింది. మొదట బయల్పడిన లింగమునకు శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారు.  గొల్లలమామిడాడ బిక్కవోలు నుంచి 5 కిమీ దూరం లోనే ఉంది. కాకినాడ 30 కిమీ దూరం లో ఉంది . 

గొల్లలమామిడాడ :
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం చాల ప్రసిద్ధి చెందిన ఆలయం,  ఇక్కడ గల శ్రీ కోదండరామ చంద్ర మూర్తి వారి దేవస్థానము ప్రతిష్ట 1889 సంవత్సరం లో జరిగింది. తూర్పుగోపురం పొడవు 160 అడుగులు 1948 సంవత్సరం లో నిర్మించారు . పశ్చిమగోపురం ఎత్తు 200 అడుగులు 1956 లో నిర్మించారు. ఇక్కడ గల అద్దాలమండపము 1975 సంవత్సరం లో నిర్మించారు . ఇక్కడ అద్దాలమండపము తప్పకుండ చూడాల్సిందే . ప్రతిరోజూ శ్రీరామచంద్రమూర్తి వారికి తులసిపూజ సీతమ్మ వారికి కుంకుమ పూజలు జరుగుతాయి . ప్రతి మంగళవారం , శనివారం శ్రీ ఆంజనేయస్వామి వారికీ తమలపాకులు , గంగసింధూరం పూజలు జరుగుతాయి . 
గొల్లలమామిడాడ నుంచి బిక్కవోలు 5 కిమీ దూరం . సామర్లకోట 20 కిమీ దూరం లో ఉంది. 


కాండ్రకోట నూకాలమ్మ వారి ఆలయం : 

పెద్దాపురం నుంచి 10 కిమీ దూరం లో నూకాలమ్మ వారి ఆలయం కలదు. పెద్దాపురం మరిడమ్మ , కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలు చాల పెద్దవి . దగ్గరకు వెళ్లి చూస్తుంటే మనకు తెలియకుండానే నమస్కరిస్తాము , అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది . 

కాండ్రకోటను పూర్వం కిమీరు అని పిలిచే వారు.కిమ్మీరాసురుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేయడం కోసం వచ్చాడు. అందువల్ల ఈపేరు వచ్చింది తరువాత కాలంలో కాండ్రుడు అనే రాజు పరిపాలించడం వల్ల క్రాండ్రకోట అని పేరు వచ్చింది.కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడు. అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతుని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారు.అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధంలో ఓడిపోయారు.ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తిని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడు. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు పంపింది. ఆ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆ ఆది పరాశక్తి నూకాలమ్మ అమ్మవారు యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించాడు - అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరనిది. 

పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు

మనం కాండ్రకోట నుంచి తొలితిరుపతి 5 కిమీ దూరం లో ఉంది . 


సర్పవరం భావనారాయణ స్వామి 
కాకినాడ సర్పరం లో పురాతన వైష్ణవ క్షేత్రం కలదు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన 108 దివ్యతిరుపతులను దర్శించిన పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించబడింది. పంచ భావనారాయణ స్వామి ఆలయాలలో సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం ఒకటి. మిగిలినవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), , పట్టసం.  ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించారు.

విష్ణుమూర్తి కోసం  ఆది శేషుడు ( సర్పం )  తపస్సు చేసి వరం పొందిన ప్రదేశం కనుక  సర్పవరం అని పేరువచ్చింది. ఆ తరువాతి కాలం లో నారద మహర్షి తపస్సు చేసారని స్థలపురాణం .. ఆ కథ ఈ విధంగా ఉంది. 

పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణుమూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహాతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు. నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం (పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు. దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు. ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.

సర్పవరం నుంచి శ్రీపీఠం 2 కిమీ దూరం లోను , పిఠాపురం 16 కిమీ దూరం లోను  ఉంది. సర్పవరం నుంచి కాకినాడ బస్సు స్టాండ్ కు చేరుకొని అక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్ళవచ్చు .


కోటిపల్లి
ద్రాక్షారామం నుంచి 10 కిమీ దూరం లో కోటిపల్లి ఉంది. చిన్న పుణ్యం చేసిన కోటి రేట్లు ఫలితాన్ని ఇచ్చే క్షేత్రం కనుక కోటి ఫలి అని పిలుస్తారు . వాడుక భాషలో కోటిపల్లి అయింది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు,శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిఉంది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, జనార్థన స్వామి వారే క్షేత్ర పాలకుడు .  శివుని ఆలయానికి విష్ణువు క్షేత్ర పాలకుడు , శివ కేశవ అబేధానికి ఈ ఆలయం 

ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి ఉత్తరపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యం లో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గొదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.

ఈ ఆలయ ప్రాంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం, భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు, కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది.ఈ దేవాలయములో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు.ద్రాక్షారామం చుట్టూ వున్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి.

కోటిపల్లి రేవు దాటి అవతలకి వెళ్తే ముక్తేశ్వరం , అయినవిల్లి వెళ్ళవచ్చు. కోటిపల్లి నుంచి కాకినాడ వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు లు ఉంటాయి.


ముక్తేశ్వరం
ముక్తేశ్వరం అయినవిల్లి రెండు పక్కపక్క క్షేత్రాలు . పురాతనమైన క్షేత్రాలు త్రేతాయుగం , ద్వాపర యుగం నాటి క్షేత్రాలు . ముక్తేశ్వరం లో రెండు శివాలయాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. ఒక ఆలయం పేరు ముక్తేశ్వరాలయం రెండో ఆలయం పేరు క్షణ ముక్తేశ్వరాయలం .  ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. గౌతమీ నదీ తీర అత్యంత పురాతనమై దేవాలయం.రావణ వధ తర్వాత ఆ బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీ రాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ట చేశాడు .ఒక సారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానం లో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగి పోయింది .అక్కడ దిగి నడుచు కుంటూ వెళ్లితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరు మిట్లు గొలిపే కాంతితో దర్శన మిచ్చింది .దానికి దగ్గరలో’’ శ్రమణి ‘’అనే తాపసి ధ్యానం లో కనిపించింది .రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీ రామ దర్శనం చేత తనకు శాప విమోచనమైఁదని తెలిపింది .పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు .వెంటనే పరమేశ్వరుడు దానినుండి ప్రత్యక్షమయ్యాడు .తాపసి శ్రమణి శివ దర్శనం తో జ్యోతిర్లింగం లో ఐక్యమై పోయింది . శ్రీ రాముని కోర్కపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగం గా వెలిశాడు .ఒక్కక్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణ ముక్తేశ్వర క్షేత్రమయింది .శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ట చేసి బ్రహ్మ హత్యా పాతకం నుండి విముక్తడయ్యాడు .కనుక ఆలయం త్రేతా యుగానికి చెందినది .సప్తమహర్షులు ఇక్కడ కొచ్చి స్వామిని అర్చించారు .క్షేత్రపాలకుడు కేశవ స్వామి .శ్రావణ ఆశ్వయుజ కార్తీక మాసాలలో ,శివరాత్రికి విశేషం గా పూజలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి 


ముక్తేశ్వర ఆలయం అమలాపురం నుండి 10కిలోమీటర్ల, కాకినాడకు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినవిల్లి వినాయక క్షేత్రానికి 3 కిమీ దూరం లోను ఉంది. 


అయినవిల్లి :
స్వయంభు వినాయక క్షేత్రాలలో మొదటి క్షేత్రం అయినవిల్లేనని చెప్పబడుతుంది.  అయినవిల్లి క్షేత్రం గురించి మరొక స్థలపురాణం కూడా ఉంది  రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. ఈ క్షేత్రం  కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.

వినాయకుని ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటైన కాణిపాకం వినాయకుని ఆలయం కంటే పూర్వమే ఈ ఆలయం ఉంది. 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని పేర్కొన్నారు . 

ఈ ఆలయం లో శైవాగమనంలో పూజలు చేస్తున్నారు. ఈ క్షేత్రం కాకినాడ నుంచి 72 కిమీ దూరం లోను , రాజమండ్రికి 55 కిమీ దూరం లోను , అమలాపురానికి 12 కిమీ దూరం లోను ఈ క్షేత్రం ఉంది. 

మురమళ్ళ 
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం విరాజిల్లుతుంది. వివాహ  ఆలస్యం అవుతున్నవారు మురమళ్ళ క్షేత్రం లో స్వామి వారికీ కళ్యాణం జరిపిస్తే ఆటంకాలు తొలిగి త్వరలోనే వివాహం అవుతుందని భక్తుల నమ్మకం. స్థలపురాణం ప్రకారం దక్ష యజ్ఞం ద్వాంసం చేసినతరువాత వీరభద్రుడు శాంతించలేదు. ఆదిపరాశక్తి తన షోడశ కళలో ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుడుని శాంతా పరుచుటకు భూమిపైకి పంపెను . అమ్మవారు తాకటం నుంచి " శరభ శరభ ఆశ్చరభ శరభ " అంటూ రావడాన్ని చుసినా వీరభద్రుడు శాంతించెను . వారివురికి గాంధర్వ వివాహ పద్దతిలో మునిమండలి వివాహం జరిపించెను. ఆ పద్దతి ప్రకారమే నేటికీ ఈ ఆలయం లో కళ్యాణం చేయిస్తారు.  కాలక్రమం లో ఈ ప్రదేశమునకు మురమళ్ళ అని వచ్చింది. 

కాకినాడ నుంచి యానాం మీదుగా బస్సు లు ఉంటాయి. రాజమండ్రి నుంచి మురమళ్లకు బస్సు లు ఉంటాయి.   
08856-278136 - Nitya Kalyanam Bookings
 Timings :  9.00AM - 1.00PM & 2.00PM - 4.30PM
ర్యాలీ

ర్యాలీ లో జగన్మోహిని  కేశవ స్వామి వారి క్షేత్రం కలదు.ర్యాలి రాజమహేంద్రవరం కి 38కి.మి., కాకినాడకు 74 కి.మి., అమలాపురంకి 34 కి.మి. దూరంలో వసిష్ఠ, గౌతమి అనేగోదావరి ఉప పాయ ల మధ్య ఉంది. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం . 
స్థల పురాణం

శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.

ర్యాలి ఆలయం లో  మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవస్వామి, శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు జగన్మోహినీ రూపం ఉంది. అచ్చంగా జగన్మోహినివలె కళ్ళు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది. అమె సిగ, ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడ సహజంగా అలరారుతుంటుంది. స్వామి పాదాలచెంత నిత్యం జలం ఉరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది. విష్ణుదేవుని పాదాల దగ్గరేకదా గంగ పుట్టింది. ఈ విగ్రహంలో చుట్టూ దశావతారాలు, శ్రీదేవి, భూదేవిగంగగరుత్మంతుడు, చెక్కబడారు.  దేవతలకు, రాక్షసులకు అమృతాన్ని పంచివచ్చిన జగన్మోహిని విష్ణుమూర్తియేనని మరచి, ఆమె రూపానికి మోహంలో పడి శివుడు ఆమె వెంటపడి పరుగెత్తాడట. ఆమె యిక్కడి వరకూ వచ్చి జగన్మోహినీ-చెన్నకేశవ మూర్తిగా శిలగా మారిందని స్థలపురాణం . 

ర్యాలి అప్పన్నపల్లి వాడపల్లి ఈ మూడు క్షేత్రాలు ఒకదానికొకటి 6-8 కిమీ దూరం లో ఉంటాయి . 

వాడపల్లి

ర్యాలీ నుంచి వాడపల్లి 6 కిమీ దూరం , రాజమండ్రి నుంచి వాడపల్లి  30 కిమీ దూరం మీకు ఇక్కడ రాజమండ్రి గురించి చెప్పడానికి గల కారణం మీరు రాజమండ్రి నుంచి యాత్ర ప్రారంభిస్తే ఇదే వరసలో వెళ్ళవచ్చు .    వాడపల్లి    ఒకప్పుడు "ఓడపల్లి" అనే పేరుండేది. సంస్కృతంలో దాన్నే "నౌకాపురి" అన్నారని స్థానికుల కథనం. 

తిరుపతి, ద్వారకా తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున, లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలుస్తారు , ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడకల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విదంగా ఉంది. వైకుంటంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకొన వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నది. అధర్మం, అన్యాయం పెరుతున్నవి. వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అపుడు విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.

కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ద బ్రాహమణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ సుచిగా గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీగర్భంలోకి వెళితే కృష్ణగరుడపక్షి వాలి ఉన్నచోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేసానుసారం వెళ్లగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ,చక్ర, గదాయుదుడైన నారాయుణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విసేషాలతో ఆ అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి పూజించుట ప్రారంభిస్తారు . ఈ దేవాలయ నిర్మాణానికి గాను అప్పటి పెద్దాపురం సంస్థానాదీశులు వత్సవాయి తిమ్మగజపతిరాజు గారు 1759లో కొన్ని భూములు స్థిరాస్తులు సమర్పించారు. పూర్వపు ఆలయం నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే అగ్నికులక్షత్రియుల కుటుంబం నిర్మించారు .  ఆరోజుల్లో పెను బోతుల గజేంద్రుడనే అగ్నికుల క్షత్రియుడుకొన్ని ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సభవించగా అతని ఓడలన్నీ సముద్రగర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి, గట్టున ప్రతిష్టించి, గుడి కట్టిస్తానని స్వామివారికి గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక, ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం అ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్టించి ఆలయం కట్టించారు .

అప్పనపల్లి 

ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల (నూకల) అప్పన అనే ఋషి ద్వారా వచ్చింది. ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్ధం తపస్సు చేశాడు. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలని వల్లె వేస్తూ ఉండేవారని ప్రతీతి.   ఇక్కడ రెండు వెంకటేశ్వర దేవస్థానములు ఉన్నాయి. ఇక్కడి వెంకటేశ్వర స్వామిని తూర్పు భారతదేశములోలా బాలాజీ అని పిలుస్తారు. పూర్వము ఉన్న దేవస్థానమును కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన కీర్తి శేషులు శ్రీమతి వాయువేగుల శీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేయ సాగెను. ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరి కాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరు నామాలను కనుగొన్నారు. ఆ కొబ్బరి కాయను ప్రతిష్ఠించి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించ సాగెను. అది దిన దిన ప్రవర్ధమానమయి పెద్ద పవిత్ర క్షేత్రమయినది.
ఇక్కడ దేవాలయములో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయములో తేడా వచ్చి కొనకుండా వెనుకకు తిరిగి రావటం జరిగింది. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చినవి. విచిత్రముగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదేచెట్టు అప్పనపల్లి తీరానికి చేరి ఉన్నదని, దానినే ధ్వజస్తంభ నిర్మాణమునకు వాడారనీ చెపుతారు. 


ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.  

అంతర్వేది
అంతర్వేది కి ఆ పేరు ఎలా వచ్చిందో తెల్సుకుందాం ..  ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.  రక్తవలోచనుని కథ ఈ ప్రాంతంలోనే జరిగిందని స్థలపురాణం .
రక్తవలోచనుని కథ
ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.
అన్న చెళ్ళెళ్ళ గట్టు
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించిన తరువాత భక్తులు అంతర్వేది లో గల   అన్న చెళ్ళెళ్ళ గట్టు చూడ్డానికి వెళ్తారు .  సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత . 
రవాణా సౌకర్యాలు
బస్సు : అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి, కాకినాడల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరవచ్చు. విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి ఉన్నాయి.
రైలు : హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.


                
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.