మోక్షం:
మనిషిని అన్ని బంధాల నుంచి విముక్తం చేసేదే ముక్తి. దీన్నే ‘మోక్షం’ అంటారు పెద్దలు.
అది ఎలా లభిస్తుందనే చర్చ అనాదిగా సాగుతోంది. ఎవరి వాదం వారికి వేదం. ఎవరి మతం వారికి సమ్మతం. వ్యక్తిగత వాదాలే మతాలుగా పరిణమించి, అనేకంగా ఆవిర్భవించాయి. ఇవన్నీ ముక్తిని సాధించడానికి ఉపయోగపడేవే!
ఒక గమ్యస్థానానికి వెళ్లాలనుకొన్నప్పుడు, మనిషి బయలుదేరే చోటు నుంచి ఒకే దారి ఉండదు. అన్ని దిక్కుల నుంచీ ఎన్నో దారులుంటాయి. ఎటు నుంచి వెళ్లినా చేరాల్సిన చోటు ఒకటే. ఏ దారిలో వెళ్లినా ప్రయాణికుడు గమ్యం చేరేవరకు విశ్రమించడు. ఇదే జీవన స్వభావం.
ఈ విషయాన్నే మోక్షానికీ అన్వయిస్తూ ‘శివ మహిమ్న స్తోత్రం’ ఇలా ప్రబోధించింది-
ఓ పరమేశ్వరా! నిన్ను చేరడానికి మనుషులు ఎన్నో మార్గాలు ఏర్పరచుకొన్నారు. కొందరు వేదమార్గంలో నిన్ను చేరుకొంటున్నారు. కొందరు సాంఖ్యమార్గంలో, కొందరు యోగమార్గంలో, కొందరు శైవ మార్గంలో, కొందరు వైష్ణవ మార్గంలో ముందుకు సాగుతున్నారు’. ఎవరికి వారు తాము నమ్మిన మార్గాలే గొప్పవని వాదిస్తారు. ఇదంతా చూస్తుంటే ‘లోకో భిన్న రుచిః’ అనే సామెత గుర్తుకు వస్తుంది.
అన్ని లౌకిక బంధాలనూ పరిత్యజించి, పరమేశ్వరుడిలో లీనం కావడమే మోక్షం.
అది నాలుగు విధాలని ‘శివానంద లహరి’లో శంకర భగవత్పాదులు బోధించారు.
మొదటిది సారూప్య ముక్తి. భక్తుడు శివుణ్ని అర్చిస్తున్నప్పుడు తానూ శివుడిలా రూపం ధరించాలని కోరుకోవడమే ఈ ప్రక్రియలోని పరమార్థం. స్తోత్ర పఠనంలో- శివుడి రూపాన్ని స్మరించడం, ఆ రూపాన్నే ఆరాధించడం అంటే శివుడితో సమానమైన రూపాన్ని కోరుకోవడమే! అందువల్ల దీన్ని సారూప్య ముక్తిగా భావిస్తారు.
రెండోది సామీప్య ముక్తి. శివుడి కథలు ప్రవచించేవారికి ఎప్పుడూ దగ్గరగా ఉండటం, వారు చేసే ఆరాధనల్లో పాలుపంచుకోవడం, వారితోనే స్నేహం చేస్తూ కలిసి మెలిసి తిరగడం వంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఆనందదాయకాలైన అంశాలే కాబట్టి- దీన్ని సామీప్య ముక్తిగా పిలుస్తారు.
మూడోది, సాలోక్య ముక్తి. అంటే, శివుడు ఉండే లోకంలోనే ఉండాలనుకోవడం! శివుడు లేని చోటు ఏదైనా ఉందా అంటే ‘లేనే లేదు’ అని బదులిస్తుంది ప్రాచీన సాహిత్యం. చరాచరాలతో కూడిన మానవ లోకంలోనూ అణువణువునా శివుడున్నాడంటారు. మానవ లోకంలోని మనిషి- శివుడు ఉన్నచోటే ఉన్నాడని దీని అర్థం. ఈ ప్రపంచం అంతా శివుడి శరీరమే అని వేదాలు చెబుతున్నాయి. ‘శివుడి తనువే ఈ జగత్తు’ అనే భావన ఇందులో కనిపిస్తుంది. శివుడున్న లోకంలోనే తానూ ఉన్నాననే భావనను భక్తుడికి కలిగించడం వల్ల ఇది సాలోక్య ముక్తి!
నాలుగోది సాయుజ్య ముక్తి. సాయుజ్యం అంటే- కలిసి ఉండటం. చరాచరాలన్నీ శివమయాలే అన్నప్పుడు, అందులో చరాలు (చైతన్యం కలిగిన ప్రాణులు)గా మనుషులూ ఉన్నట్లే. మనుషులందరూ శివస్వరూపాలైనప్పుడు, ఆయనతో వారు నిరంతరం కలిసి ఉన్నట్లే అవుతుంది. మనిషికి శివుడితో సాయుజ్య ముక్తి లభించడం అంటే ఇదే.
ఇలా ప్రతి మనిషికీ నాలుగు మోక్షాలు అందుబాటులో ఉంటాయి.
ముక్తి అనేది ఎవరికైనా సాధ్యమే!
Also Read : సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
శివుడి కరుణకు ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. అందుకే ఆయన తనను అర్చించిన సాలీడు, పాము, ఏనుగును తనలో లీనం చేసుకొన్నాడు. శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) నామాలతో ‘శ్రీకాళహస్తీశ్వరుడు’ అయ్యాడు.
కాలు కదపనివాడికి ఏదీ లభించదు. కదిలి ముందుకు సాగేవాడికి ప్రపంచమంతా ఓ కుగ్రామంలా కనపడుతుంది.
మోక్ష విషయంలోనూ అన్వయించుకోవాల్సిన సూత్రం ఇది!
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
Famous Posts:
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
మోక్షం, Moksham, moksham in Telugu, gajendra moksham Telugu, dharma sandehalu Telugu, sanatana dharmam, devotional story's