ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది - Unknown Facts about Srisailam Istakameswari Temple
శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం.
తిరుమల తరువాత అంతటి ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైలం, అంతటి అనుగ్రహం కలిగిన దేవుడు మల్లన్న. ఇక్కడి పర్వతాలపై కొలువైన మల్లన్నను ఒకప్పుడు చుట్టుపక్కల గల గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకునే వారు.
ఈ రోజున వివిధ దేశాలను భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు. మల్లన్న నిలయమైన శ్రీ శైలం ... సిద్ధ క్షేత్రం. ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అరణ్యంలో కనిపిస్తూ వుంటాయి. అలాగే ప్రాచీనకాలం నాటి ఆలయాలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైనదిగా 'ఇష్టకామేశ్వరీ ఆలయం' దర్శనమిస్తోంది.
పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న 'ఇష్టకామేశ్వరీ దేవి' ... నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవలసి వుంటుంది. పక్షుల కిలకిలలు ... జంతువుల అరుపులు ... జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుంది.
ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి వుంటుంది. రెండు చేతులలో తామర పుష్పాలను ... మిగతా రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి వుంటుంది. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇదే విషయం 'ఇష్ట కామేశ్వరీ వ్రతం' లోను కనిపిస్తుంది.
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది. పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో. అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది. అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది. సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ? అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు.
అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...
శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి.
శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తరువాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది. డోర్నాల్ మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళతాయి. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాళ్లను దాటుకుని జీపు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో జీపు పల్టీ కొడుతుందేమో అన్న భయం కూడా కలుగుతుంది. కాకపోతే డ్రైవర్లు ఈ మార్గంలో ఎంతో నేర్పు కలిగిన వారు కావడంతో సురక్షితంగానే గమ్యస్థానానికి చేరుస్తారు.
దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ఈ ప్రయాణం వృద్ధులకు అంత శ్రేయస్కరం కాదు. మార్గ మధ్యంలో జంతువుల అరుపులు, జలపాతాల సవ్వళ్లు కూడా వినిపిస్తాయి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో జీపులను నిలిపి వేస్తారు. జీపు నుంచి కింది దిగే ప్రయాణికులు అక్కడి ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మరచిపోతారు. అటవీ మార్గంలో ఒక కిలోమీటరు నడక తరువాత పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. స్థానికులు పర్యాటకులకు అమ్మవారి విశిష్టతను, ఆ ప్రాంత ప్రత్యేకతలను తెలియజేస్తారు.
రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరించడంతో సాయంత్రం 5 దాటిన తరువాత అడవిలోకి జీపులను అనుమతించరు. కోరిన కోర్కెలు తీర్చే ఎంతో మహిమ గల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్లే పర్యాటకులు తప్పక దర్శించాలి.
Famous Posts:
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.
ఇష్టకామేశ్వరి అమ్మవారు, శ్రీశైలం, Sri Istakameswari Devi Temple , Srisailam, istakameswari temple images, ista kameswari vratam, ista kameswari stotram, ista kameswari devi photos,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment