శ్రీవారికి నిత్యం అలంకరించే దండలు - Lord Venkateswara Swamy Statue with Decorative Flowers

శ్రీవారికి నిత్యం అలంకరించే దండలు

తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.

ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేదపండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని కరాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఎందుకుంటే స్వామివారిని చూడడమే చాలా తక్కువ సమయం. అలాంటిది ఆయన ఎన్ని పూల దండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని. శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శిఖామణి - శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.

2. సాలిగ్రామాలు - శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది.

3. కంఠసరి - మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి. ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది.

4. వక్ష స్థల లక్ష్మి - శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది.

5. శంఖుచక్రం - శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.

6. కఠారి సరం - శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు.

7. తావళములు - రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడ దీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది. రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.

9. తిరువడి దండలు - శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగిసేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు.

ఇదేకాకుండా శ్రీవారి ఆనందనిలయంలోని వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు.

భోగశ్రీనివాసమూర్తికి - ఒక దండ

కొలువు శ్రీనివాసమూర్తికి - ఒక దండ

శ్రీదేవి, భూదేవి సహిత మలయప్పస్వామికి - 3 దండలు

శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి - 3 దండలు

శ్రీ సీతారామలక్ష్మణులకు - 3దండలు

శ్రీ రుక్మిణీ శ్రీక్రిష్ణులకు - 2దండలు

చక్రతాళ్వారుకు - ఒక దండ

అనంత గరుడ విష్వక్షేనులకు - మూడు దండలు

సుగ్రీవ అంగద హనుమంతులకు -  మూడు దండలు

ఇతర విగ్రహమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండలు..

బంగారు వాకిలి ద్వారపాలకులు - రెండు దండలు

గరుడాళ్వారు - ఒక దండ

వరదరాజస్వామి - ఒక దండ

వకుళమాలిక - ఒక దండ

భగవద్రామానుజులు - రెండు దండలు

యోగనరసింహస్వామి - ఒక దండ

విష్వక్షేనుల వారికి - ఒక దండ

పోటు తాయారు - ఒక దండ

బేడి ఆంజనేయస్వామికి - ఒక దండ

శ్రీ వరాహస్వామి ఆలయానికి - 3దండలు

కోనేటి గట్టు ఆంజనేయస్వామికి - ఒక దండ

అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్యకళ్యాణోత్సవం, వసంతోత్సవం, వూరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలలో కూర్చబడతాయి.

అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగులు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి జరిగే తోమాలసేవకు గాను ఈ పుష్ప అర నుంచి సిద్థం చేయడిన పూలమాలలను, జియ్యంగారులు తలపై పెట్టుకుని బాజాభజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్థంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది.

Tags:Tirumala, Tirupathi, Srivaru, Srivari seva, Srivari puladandalu, Flowers, TTD, Tirumala Seva, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS