History of Tirumala Laddu in Telugu

తిరుపతి లడ్డుకి 76 సంవత్సరాలు మనలో చాలా మందికి తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. 

తిరుపతి వెళ్లాము అని చెప్పగానే గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే… లడ్డూ ఎక్కడ అని. తిరుపతి లడ్డును పంచడంతోపాటు పుచ్చుకోవడమూ ఓ దర్జానే. వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా… లడ్డూకు మాత్రం తిరుగులేదు.
వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేదీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు. దాంతో దూరప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. 

అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అప్పుడే లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందట. అది కాస్తా చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది.
పెరుగుతున్న లడ్డూ దిట్టం… 
లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే ‘పడితరం దిట్టం స్కేలు’ అంటారు.పడిని కొలమానంగా నిర్ణయించుకున్నారు. పడి అంటే 51 వస్తువులు. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. అన్న ప్రసాదాలకు సోలను పరిమాణంగా తీసుకుంటారు. అరసోల, పావుసోల కొలతలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాణాల ఆధారంగా సరుకులను కేటాయిస్తారు.

ఈ కొలమానాల ప్రకారం 5,100 లడ్డూలు తయారు చేయడానికి… ఆవు నెయ్యి 185 కిలోలు, శెనగపిండి 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 35 కిలోలు, ఎండు ద్రాక్ష 17.5 కిలోలు, కలకండ 10 కిలోలు, యాలకులు 5 కిలోలు వినియోగిస్తారు. అంటే 5,100 లడ్డూల తయారీకి 852 కేజీల సరుకుల్ని వినియోగిస్తారన్నమాట!
తల్లి రుచి చూసిన తర్వాతే…
కొడుకు ఆకలి తల్లికి మాత్రమే తెలుసు. అందుకేనేమో, తల్లిప్రేమకు చిహ్నంగా మూలమూర్తి కొలువుండే గర్భాలయానికి శ్రీవారి పోటు(వంటశాల)కు ముందు శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహాన్ని నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయ మూల ఆలయంలో నిర్మించిన పోటులో ప్రసాదాలు తయారు చేస్తారు. వాటిని వకుళమాత ముందు కొంతసేపు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డూ వడలు మొదలైన పనియారాల్ని ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు.
మూడు రకాల లడ్డూ…

తిరుపతి లడ్డూల్ని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారుచేసి, గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాములు బరువుండే దీని ధర రూ.25.
1940 తొలిరోజుల్లో లడ్డూ (అప్పట్లో కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత 2 రూపాయలకు విక్రయించేవారు. మెల్లగా అది నాలుగు, ఐదు, పదికి పెరిగింది. ఇప్పుడు ఏకంగా రూ.25కు చేరింది. రేటు పెరిగినా దానికున్న డిమాండ్ మాత్రం అంతా ఇంతా కాదు. రూ.50 నుండి రూ.75 వరకు చెల్లించినా లడ్డూలు దొరకని సందర్భాలు ఉన్నాయి.
రద్దయిన మిరాశి పద్ధతి, పూర్వం శ్రీవారి ప్రసాదాలు, పనియారాలను అర్చకులు, జీయంగార్లలో కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు. ఈ సంగతి అప్పటి నార్త్ ఆర్కాట్ జిల్లా (తిరుమల ఆ జిల్లా పరిధిలో ఉండేది) అధికారి జి.జె.స్టార్టన్ ఆలయ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత, రోజురోజుకీ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, అప్పటి ఆలయ పేష్కార్ అన్నారావు కొత్త పద్ధతిని ప్రారంభించారు. దీని ప్రకారం లడ్డూలను తయారుచేసే మిరాశిదారులకు డబ్బుకు బదులు లడ్డూలనే ప్రతిఫలంగా ముట్టజెప్పేవారు. 51 లడ్డూలు తయారు చేస్తే 6 లడ్లు వారి సొంతం. మిరాశిదారులు వాటిని విక్రయించి నగదు పొందేవారు. 1950లో రోజుకు వెయ్యి లడ్లు తయారుచేసే మిరాశిదారులు 1990 నాటికి సుమారు లక్ష లడ్డూలు తయారుచేసే స్థాయికి చేరారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 1996, మార్చి 18న మిరాశి వ్యవస్థను రద్దు చేశారు.

కనుమరుగైన ఆనాటి రుచి, తిరుపతి లడ్డూ రుచి మారుతోందని భక్తులు అంటున్నారు. కాలంతోపాటు మార్పు సహజమే అయినా ఆనాటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కడున్నాయని అధికారులు అంటున్నారు. లడ్డూ తయారీలో వినియోగించే శెనగపప్పు (శెనగపిండి), చెరకు (చక్కెర)ను గతంలో సేంద్రీయ ఎరువులతో పండించేవారు. ప్రస్తుతం కృత్రిమ ఎరువులతో పండిస్తున్నారు. పొయ్యికింద కట్టెలకు బదులు గ్యాస్‌ను, బూందీని, చక్కెరపాకాన్ని కలపడానికి యంత్రం వాడుతున్నారు.
లడ్డూల్ని యంత్రాలతో తయారు చేయడం వల్ల వాటిమీద ఉన్న చక్కెరపాకం కారిపోతోంది. ఫలితంగా ఒక్కరోజులోనే గట్టిపడిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా లక్షలాది లడ్డూలు తయారు చేయాలంటే పాత పద్ధతిని అనుసరిస్తే సాధ్యమయ్యే పనేనా అంటారు అధికారులు. ఆవునెయ్యి, ముంత మామిడిపప్పు, ఎండుద్రాక్ష కంటే కలకండ, ఇతర పదార్థాల్ని ఎక్కువగా వినియోగిస్తుండటం కూడా మరో కారణం.
సబ్సిడీ ధరపై లడ్డూల విక్రయం, ప్రస్తుతం ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి 25 రూపాయలు పడుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనానికి వెళ్లే వారికి సబ్సిడీ ధరపై రూ.10 చొప్పున రెండు లడ్డూలు, రూ. 50 సుదర్శన్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లిన భక్తులకు టికెట్టు నిబంధనల కింద రెండేసి లడ్డూలు ఇస్తారు. ఇక ఆర్జిత సేవలో వెళ్లిన భక్తులకు ఆ సేవలో కేటాయించిన లడ్డూలు, ఇతర ప్రసాదాలు అందజేస్తారు. అదనపు లడ్డూలు కావాలంటే ప్రత్యేక కౌంటర్లలో రూ.100కు నాలుగు, రూ.50కి రెండు ఇస్తారు. అలాగే ఆలయ డిప్యూటీ ఈవో, రిసెప్షన్ డెప్యూటీ ఈవో, ఓఎస్‌డీ, ఆలయ పేష్కార్, పోటు పేష్కార్ సిఫారసుతో కోరినన్ని లడ్డూలు పొందవచ్చు. కల్యాణోత్సవం లడ్డూలు మాత్రం ఆర్జిత సేవల భక్తులకు మాత్రమే కేటాయిస్తారు.
లడ్డూకు మేధోసంపత్తి హక్కులు…
వెంకన్న లడ్డూకి పేటెంట్ హక్కులు సాధించుకునేందుకు చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగంలో దరఖాస్తు చేసింది టీటీడీ. మాజీ ఈవో డా॥కేవీ రమణాచారి లడ్డూ పేటెంట్ హక్కుల సాధన కోసం విశేషంగా కృషిచేశారు. లడ్డూ తయారీ విధానం, రుచి, నిల్వ సామర్థ్యం లాంటి అంశాలను ప్రధానంగా పరిశీలించిన జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ… వెంకన్న లడ్డూను తన జాబితాలో చేర్చింది. తిరుపతి లడ్డూకు మేధోసంపత్తి హక్కులు అందజేసినట్టు 2009, సెప్టెంబరు 18న ప్రకటించింది.
ఇవి కూడా చూడండి

తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ ఎలా బుక్ చేస్కోవాలి?
తిరుమల వెళ్లేముందు ఈ వీడియో చూసి వెళ్ళండి
తిరుమల అలిపిరి నడకమార్గం కోసం మీకు తెలుసా?
శ్రీవారి మెట్లమార్గం వివరాలు తెలుసుకోండి

credits: hindu dharma chakram
tirumala information in telugu, tirumala laddu history, tirumala alipiri steps, srivari steps way, tirumala surrounding temples details, tirumala history in telugu, tirumala tirupati,temple information in telugu. 
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

1 comments:

Have You Visited These Temples