మొక్కు తీర్చడం అంటే ఏమిటి ? దేవుడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ? Importance of Devuni Mokku

మొక్కు

అసలు ఈ మొక్కు అన్నమాట ఎందుకు ప్రారంభం అయిందంటే తరిగొండ వెంగమాంబ గారు వేంకటాచల మహాత్మ్యము అని ఒక గ్రంథం చేశారు. 

ఆ తల్లి ఆ గ్రంథ రచన వేంకటేశ్వరానుగ్రహంతోనే చేశారు.

వేంకటేశ్వర స్వామివారు ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తర్వాత ఒకసారి లక్ష్మీదేవి అడిగింది.

ఎందుకు ఈ భూమండలం మీద? మీరు కుబేరుని దగ్గర తీర్చుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు. 

ఆమె ఆదిలక్ష్మి. ఆమె తలచుకుంటే కుబేరుని అప్పు తీర్చడం ఎంతసేపు. కాబట్టి కుబేరుని అప్పు తీర్చేద్దాం. మళ్ళీ మనం శ్రీవైకుంఠమునకు చేరుకుందాం అన్నది.

ఇక్కడ అప్పు తీర్చి వైకుంఠము చేరుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది. 

పాపం అని తెలుసు. ఆ పాపం చేస్తే దుఃఖం వస్తుంది దాని ఫలితంగా అని తెలుసు. తెలిసి కూడా దుఃఖకారకమైన పాపాన్ని చేయకుండా నిగ్రహ శక్తితో ఉండలేరు మనుష్యులు. దానికి కారణం కలిపురుషుడే. 

దుఃఖమునకు పాపం కారణం అని తెలిసి కూడా పాపం చేయిస్తూ ఉంటే ఆ పాపం వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు నన్ను పిలుస్తారు.

వాళ్ళు పాపం చేసేటప్పుడు ఫరవాలేదులే ఏదో చెప్పేశారు అని చేసేస్తారు. అప్పుడు నేను అక్కరలేదు. కానీ పాపమునకు ఫలితం వచ్చినప్పుడు వాడు ‘గోవిందా’ అంటాడు. ఏడుకొండల వాడా వేంకటరమణా అంటాడు. ఆపద మ్రొక్కుల వాడా అని పిలుస్తాడు.

ఆపద అన్న మాటకి అర్థం ఏమిటంటే మన ప్రయత్నం చేత పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్టు. ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేము.

అలా ఇరుక్కుపోయినప్పుడు ఆపద మ్రొక్కుల వాడా అని పిలుస్తాం. ఈ ఆపద నుంచి నన్ను తప్పించు. మొక్కు మన శక్తి కొలది పెడతాం. ఒక్కొక్కడు తలనీలాలు ఇస్తాను అంటాడు. ఒకడు కొండకు నడిచి వస్తాను అంటాడు. ఒకడు స్వామీ నీ హుండీలో డబ్బులు వేస్తాను అంటాడు. వీటిని మొక్కులు అంటారు.

వేంకటేశ్వర స్వామి హృదయం ప్రకారం మొక్కు వ్యాపారం కాదు. అది పాపం వలన దుఃఖం వస్తోంది అని వాడు తెలుసుకోవాలి. తెలుసుకొని పరమేశ్వరుణ్ణి పిలిస్తే నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అని వేంకటాచలం పై ఉన్నాడు కలియుగంలో. ఎవడు ఎక్కడ లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది. నేను విని వాడిని ఆపదలోంచి ఉద్ధరిస్తాను. వాడు మొక్కు తీరుస్తాడు. పరమ ధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకు వేసినటువంటి ద్రవ్యంలో తీసుకుని ఖర్చుకి జేబులో పెట్టుకుంటాను. పాపాల వలన దుఃఖములు వచ్చి దుఃఖముల నుంచి బయట పడడానికి ఆపద మొక్కుల వాడా అని పిలిచి తీసుకువచ్చి నా హుండీలో వేసిన డబ్బు జనుల ఉద్ధరణకొరకు, వారి కోరికలు తీరడానికి పంపేస్తాను.

నా పేరుమీద ఎన్నో జరుగుతాయి. నిత్యాన్నదానం ఆరోగ్యం, చెట్లు నాటుతారు. ఎన్ని ప్రయోజనాలో! వాటికి వెళ్ళిపోతుంది ఆ డబ్బు.

అక్కడ వాడాడు మొక్కు అన్న మాట. అంటే పాపం వలన దుఃఖం వచ్చింది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇక వాడు పాపం జోలికి వెళ్ళకుండా ఉండడం నాకు ఇష్టం. అది వేంకటేశ్వరుడి యొక్క అభిప్రాయం.

మొక్కు అంటే ఆపత్కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు. ఈశ్వరా! నన్ను ఈ ఆపదనుంచి బయట పడెయ్యి. నేను ఒక రూపాయి హుండీలో వేస్తాను అన్నావు. ఆపదనుంచి గట్టున పడిపోయావు. ఒకసారి ఆపద వచ్చి తీరిన తర్వాత బుద్ధిని దిద్దుకోవాలి. నేను హుండీలో రూపాయి వేస్తాను అనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు వెళ్తుంటే వాళ్లకి రూపాయి ఇచ్చి పంపించకూడదు. నేను హుండీలో వేస్తాను అన్న మాటకి అర్థం నేను తిరుపతి వచ్చి అని.

వేంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి స్వామీ! నాకు కేవల ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ రూపాయి పట్టుకెళ్ళి హుండీలో వేయాలి. అప్పుడు మొక్కు పూర్తి అవుతుంది. కనుక మనమే క్షేత్రమునకు వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి.

మొక్కినప్పుడు ఏ భాష వాడారు అన్నది ప్రధానం కాదు. అందులో ప్రధానం ఇక పాపం వైపు దృష్టి పోకుండా అని. ఒకసారి ఎవడు మనను ఉద్ధరించాడు అని అనుకుంటున్నామో వాడి దగ్గరికి వెళ్లి కృతజ్ఞత చెప్తాం కదా! ఆపద నుంచి వినిర్ముక్తమైనప్పుడు కృతజ్ఞతావిష్కారం కనుక

వాడు బయట పడవేస్తాడు అన్న నమ్మకంతో నీ భక్తికి ప్రతినిధిగా పట్టుకొచ్చి ఏదో ఇస్తాను అన్నావు గనుక నువ్వు వెళ్ళి కృతజ్ఞతను ప్రకటనం చేసి సమర్పణం చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది. 

మొక్కు తీర్చుట అన్న మాటలో ఆ యదార్థాన్ని భావన చేసిన నాడు భక్తి ఆవిష్కృతమవుతుంది. ఇంటిల్లిపాదీ వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే కృతఘ్నులం అయిపోతాం అని అందరం వెళ్ళడం చేత అందరి సంస్కారం బలం బయటికి వచ్చింది. మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి వెళ్ళవచ్చు. 

అవ్వదా నువ్వు ఒక్కడివైనా వెళ్ళి మొక్కు చెల్లించి దర్శనం చేసి రావాలి. మొక్కు అన్న మాటని ఆ కోణంలో ఆలోచన చేసి తీర్చుకున్నప్పుడే భక్తి, కృతజ్ఞత అన్న మాటలకు అర్థం ఉంటుంది.

Famous Posts:

ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి  ?


గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు


ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు


తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు


ఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు


మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు?

మొక్కు, mokku, Devudu mokku, mokku meaning, tirumala, venkateswara swamy, mokku venkateswara swamy.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS